Hindu Muslim Marriage: హిందూ ముస్లిం వివాహం ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లదు - తేల్చి చెప్పిన హైకోర్ట్
Hindu Muslim Couple Marriage: హిందూ మహిళ ముస్లింని పెళ్లి చేసుకుంటే ఆ వివాహం ముస్లిం పర్సనల్ లా కింద చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
Hindu Muslim Wedding: హిందూ మహిళ, ముస్లిం పురుషుడు పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇది చెల్లని వివాహమే అవుతుందని వెల్లడించింది. Special Marriage Act, 1954 కింద పెళ్లిని రిజిస్టర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయగా కోర్టు దాన్ని కొట్టివేసింది. ఆ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలన్న విజ్ఞప్తినీ తిరస్కరించింది. జస్టిస్ గుర్‌పాల్ సింగ్ అహుల్వాలియా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతానికి చెందిన పురుషుడు హిందూ మహిళను పెళ్లాడితే అది అసహజ వివాహం కిందకే వస్తుందని..ముస్లిం పర్సనల్ లా ఇదే చెబుతోందని వెల్లడించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నప్పటికీ అది చెల్లదని స్పష్టం చేశారు. మే 27వ తేదీన ఈ పిటిషన్‌ని విచారించింది.
ఇదీ పిటిషన్..
ఇటీవలే ఓ జంట మతాంతర వివాహం చేసుకుంది. మహిళ హిందువు. పురుషుడు ముస్లిం. అయితే..మహిళ కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. నలుగురూ నానా రకాలుగా అనుకుంటారని మండి పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారమంతా తీసుకెళ్లి, ముస్లింని పెళ్లి చేసుకుందని ఆగ్రహంతో ఉన్నారు. అయితే..ఈ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకుంది. కానీ ఆ మహిళ మతం మార్చుకునేందుకు సిద్ధంగా లేదు. ఆమె భర్త కూడా మతం మార్చుకోడానికి మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలోనే తమకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌నే కోర్టు కొట్టి వేసింది.