Marital Rape: భార్యను బలవంతం చేయడం అత్యాచారమా! పిటిషన్ విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
Supreme Court : కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించనున్నట్లు తెలిపింది.
Marital Rape: భార్యతో బలవంతంగా కలవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, మారిటల్ రేప్ అనడానికి ఆస్కారం లేదని గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అతడ్ని వివాహం చేసుకున్నందన వైవాహిక అత్యాచారం అనలేమని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు భర్తపై భార్య పెట్టిన అత్యాచారం కేసును ఆ హైకోర్టు కొట్టివేసింది. ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో భర్త అసహజ శృంగారంలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదని నిర్ధారణకు వచ్చాం. ఆరోపణల ఆధారంగా నమోదైన ఈ ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్చలు అవసరం లేదని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది’ అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
సుప్రీంకోర్టులో పిటిషన్
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని నేరం కేటగిరీలో వైవాహిక అత్యాచారాన్ని నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారించనున్నట్లు తెలిపింది. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని మినహాయింపుగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇన్ కం ట్యాక్స్ కు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పిటిషన్ ను విచారించేందుకు మంగళవారం రోజును నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, వైవాహిక అత్యాచారం కేసును వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఈ ఆదాయపు పన్ను కేసు విచారణకు రోజంతా సమయం పడుతుందని, వివాహిత అత్యాచారం కేసుకు ప్రాధాన్యత ఇవ్వాలని జైసింగ్ అన్నారు. మంగళవారం విచారణ జరపలేకపోతే బుధ లేదా గురువారాల్లో విచారణ చేపడతామని సీజేఐ చంద్రచూడ్ జైసింగ్‌కు హామీ ఇచ్చారు.
అసలు విషయం ఏమిటి?
మే 12, 2022న భార్య అనుమతి లేకుండా భర్త బలవంతంగా లైంగిక చర్యకు(వైవాహిక అత్యాచారం) పాల్పడడం నేరమవుతుందా? అన్న ప్రశ్నకు ఢిల్లీ హైకోర్డుకు చెందిన ద్విసభ్య ధర్మాసనం వేర్వేరు తీర్పులను వెలువరించింది. కేసును సుప్రీంకోర్టుకు రిఫర్ చేసింది. 2015లో భార్య అనుమతి లేకుండా భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడడం నేరంగా పరిగణించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వాటిని రిట్ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) దాఖలు చేశాయి. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించని భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375కి మినహాయింపును తొలగించాలని పిటిషన్ కోరింది. ఈ మినహాయింపు వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని వారు వాదించారు. దీనిపై అనేక వాదనలు జరిగాయి. ఢిల్లీ హైకోర్టు లోని జస్టిస్ రాజీవ్ శ్రీధర్, జస్టిస్ హరిశంకర్‌ల ద్విసభ్య ధర్మాసనం ఆ ఏడాది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ తీర్పులో న్యాయమూర్తులు వేర్వురు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
ఐపీసీ సెక్షన్ 375లో వైవాహిక అత్యాచారానికి సంబంధించి ఇచ్చిన మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని, ఇది వివాహితల పట్ల వివక్ష చూపడమేనని జస్టిస్ రాజీవ్ శక్ధర్ అభిప్రాయపడ్డారు. ఐపీసీలోని సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపు రాజ్యాంగ విరుద్ధం కాదని జస్టిస్ హరిశంకర్ పేర్కొన్నారు. వైవాహిక అత్యాచారాన్నినేరంగా పరిగణించాలన్న విషయంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనంలోని జడ్జీలు భిన్నమైన తీర్పులను వెలువరించారు. దీంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేశారని న్యాయవాది జూహీ అరోరా తెలిపారు.