BJP Versus Trinamool-చిచ్చు పెట్టిన వంతెన, భాజపా వర్సెస్ తృణమూల్-ఆగని మాటల యుద్ధం
పశ్చిమ బంగ సీఎమ్ మమతా బెనర్జీ..కేంద్ర మంత్రిని ఆహ్వానించకుండానే రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించటంపై భాజపా శ్రేణులు మండి పడుతున్నాయి.
భాజపా వర్సెస్ తృణమూల్
భాజపా, తృణమూల్ ఈ రెండు పేర్లు వినగానే ఉప్పు, నిప్పు గుర్తుకొస్తాయి. విషయం చిన్నదైనా, పెద్దదైనా ఈ రెండు పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. పశ్చిమ బంగ సీఎమ్ మమతా బెనర్జీ భాజపాను విమర్శించటం, తిరిగి భాజపా నాయకులు మమతపై విరుచుకుపడటం షరామామూలే. ఈ రెండు పార్టీల మధ్య ఎంత ఘర్షణ వాతావరణం ఉంటుందో గత అసెంబ్లీ ఎన్నికలే తేల్చి చెప్పాయి. ఇటీవల జరిగిన ఓ ఘటనతో మళ్లీ భాజపా వర్సెస్ తృణమూల్ యుద్ధం మొదలైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని ఆహ్వానించకుండానే సీఎం మమతా బెనర్జీ..సింగూర్‌లో రైల్వే బ్రిడ్జ్‌ని ప్రారంభించటంపై భాజపా భగ్గుమంది. రైల్వే మంత్రిని పిలవకుండా ఆ కార్యక్రమం ఎలా పూర్తి చేశారంటూ కాషాయ శ్రేణులు మండి పడుతున్నాయి. ఇన్విటేషన్ కార్డులపై రైల్వే అధికారుల పేరు ఒక్కటీ లేకపోవటంపైనా భాజపా విమర్శలు గుప్పిస్తోంది. రైల్వేశాఖ నిధులు లేకుండానే ఈ వంతెన నిర్మాణం పూర్తైందా అని ప్రశ్నిస్తున్నాయి.
సీఎం మమతది ఫెడరల్ ధోరణి: భాజపా నేత సువేందు అధికారి
రైల్వే మంత్రికి ఆహ్వానం పంపకపోవటంపై భాజపా నేత సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేటాయించిన మంత్రి పేరు ఆహ్వానితుల జాబితాలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రైల్వే శాఖ, తృణమూల్ ప్రభుత్వం కలిస్తేనే ఈ నిర్మాణం పూర్తైందని, ఈ నిధుల్లో 60% కేంద్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో సబ్‌వే నిర్మించేందుకు కేంద్రం మరో 5 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. సీఎమ్ మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్‌లు చేశారు. భాజపాది ఫెడరల్ సిద్ధాంతం అని పదేపదే విమర్శించే మమత, ఇప్పుడే అదే ఫెడరల్ ధోరణితో వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు సువేందు అధికారి.
Constructed by the @EasternRailway & after having spent the lion's share
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) June 3, 2022
for the bridge, the Railway Authorities didn't even receive an invitation for the inauguration event.
CM @MamataOfficial would unilaterally & unethically inaugurate the bridge today from Singur.
రాజకీయం చేయొద్దు:తృణమూల్ వైస్ ప్రెసిడెంట్
భాజపా శ్రేణుల నుంచి విమర్శలు పెరగటం వల్ల ఎదురు దాడి చేయటం మొదలు పెట్టింది తృణమూల్ కాంగ్రెస్. భాజపా కూడా చాలా సందర్భాల్లో తమను ఆహ్వానించకుండానే ప్రాజెక్టులను ప్రారంభించిందని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ సీఎం మమతను పిలవకుండానే ఆయా కార్యక్రమాలు నిర్వహించారని విమర్శిస్తోంది. నిజానికి మమతా బెనర్జీ గతంలో రెండుసార్లు రైల్వే మంత్రిగా విధులు నిర్వర్తించారు. అప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రణాళికలు రూపొందించారు. తన హయాంలో ఆమోదించిన ప్రాజెక్టు కాబట్టి ఆ క్రెడిట్ అంతా తనకే దక్కాలనే ఉద్దేశంతోనే సీఎం మమత ఇలా చేశారని అంటున్నాయి భాజపా వర్గాలు. తృణమూల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ మజుందర్ ఈ విమర్శలను తిప్పి కొట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే కేంద్రం కొత్త ప్రాజెక్టులు కడుతోందని, వారిలో పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా ఉన్నారని అన్నారు జయప్రకాశ్. అందుకే సీఎం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరణ ఇచ్చారు. అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నారని భాజపాపై మండి పడ్డారు.