Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక ట్విస్ట్! సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Maharashtra Political Crisis:
తీర్పుతో ట్విస్ట్..
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పెద్ద ట్విస్టే వచ్చేలా ఉంది. శివసేన పార్టీ, పేరుపై షిందే, థాక్రే వర్గాల మధ్య చాలా రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈసీ మాత్రం ఈ రెండింటినీ షిందే వర్గానికే కట్టబెట్టింది. అప్పటి నుంచి ఉద్ధవ్ థాక్రే వర్గం గుర్రుగానే ఉంది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌లు వేసింది. అప్పటి నుంచి సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరుపుతున్నప్పటికీ...తీర్పుని మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది. రెండు వర్గాల వాదనలు విన్నాక...పూర్తిస్థాయిలో అన్నీ పరిశీలించి అప్పుడు తీర్పునిస్తామని వెల్లడించింది. ఆ రోజు రానే వచ్చింది. ఇవాళ (మే 11వ తేదీన) దీనిపై తీర్పునివ్వనుంది సుప్రీంకోర్టు. ఈ తీర్పు...మహారాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పటం ఖాయం. 5 గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్థానం...తీర్పునివ్వనుంది. థాక్రే వర్గం నుంచి శిందే వర్గానికి వెళ్లిపోయిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేస్తారా లేదా అన్నదీ తేలనుంది. ఇదే జరిగితే...షిందే ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టే లెక్క. అందుకే..రెండు వర్గాలు తీర్పుపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
కీలక పరిణామాలు..
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి శిందేతో సహా 16 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని వెనకాల బీజేపీ హస్తం ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది థాక్రే శివసేన. గతేడాది జూన్‌లో జరిగింది ఇదంతా. ఈ 16 మందిపైనా అనర్హతా వేటు వేయాలని థాక్రే సేన న్యాయపోరాటం చేస్తోంది. అయితే...శిందే వర్గం బలపరీక్షలో నెగ్గిన కారణంగా...ఉద్దవ్ థాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏక్‌నాథ్ శిందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా జరగడానికి కారణమైన ఎమ్మెల్యేలపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేస్తోంది థాక్రే వర్గం. అయితే...శిందే వర్గం మాత్రం వింత వాదన వినిపిస్తోంది. ఎవరూ పార్టీ మారలేదని, శివసేన తమదేనని తేల్చి చెబుతోంది. అలాంటప్పుడు ఫిరాయింపుల చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరవాతే మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే క్లారిటీ వస్తుంది. ఒకవేళ షిందేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడితే...రాష్ట్రంలో 272 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు 137 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేనకు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఇతరులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. అయితే..ఇప్పటికే బీజేపీ,థాక్రే శివసేనకు మధ్య దూరం పెరిగింది. శిందే వర్గంపై అనర్హతా వేటు పడితే మళ్లీ బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా లేదా అన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే...థాక్రే సేన తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తోంది.