Lok Sabha Election 2024: 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీ రోల్, మమతాకు ప్రధాని అయ్యే సమర్థత ఉంది - అమర్త్య సేన్
Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వెల్లడించారు.
Amartya Sen on 2024 Elections:
అమర్త్య సేన్ ఇంటర్వ్యూ..
నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు అమర్త్య సేన్ 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు. పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పలు అంశాలు ప్రస్తావించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ తప్పదని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా పోరాడితే కానీ బీజేపీ ఓడిపోదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు ప్రధాని అయ్యే సామర్థ్యం దీదీకి ఉందని వెల్లడించారు.
"ప్రధాని అభ్యర్థిగా నిలబడే సమర్థత మమతా బెనర్జీకి ఉంది. అయితే ఆమె ప్రజల్ని ఎలా ఆకట్టుకోగలరన్నదే ముఖ్యం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి ప్రధాని అభ్యర్థిగా నిలబడాలంటే ప్రజా మద్దతు కీలకం. అది సాధించుకోగలిగితేనే ప్రస్తుత బీజేపీ పాలనకు స్వస్తి పలికి ఆమె ఆ పదవిని దక్కించుకోగలరు"
- అమర్త్యసేన్, నోబెల్ గ్రహీత
బీజేపీది సంకుచిత పాలన..
ఇదే సమయంలో బీజేపీపైనా విమర్శలు చేశారు అమర్త్య సేన్. భారతదేశ విజనరీని ఆ పార్టీ "సంకుచితం" చేస్తోందని మండి పడ్డారు.
"భారత్‌ను అర్థం చేసుకునే విధానాన్ని బీజేపీ పూర్తిగా మార్చేసింది. సంకుచితం చేసింది. కేవలం హిందూ దేశంగా, హిందీ మాట్లాడే దేశంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అంతే కాదు. దేశంలో బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. తమిళనాడులోని DMK ముఖ్యమైన పార్టీ. అలాగే మమతా బెనర్జీ TMC కూడా అంతే. సమాజ్‌వాదీ పార్టీ కూడా కొంత మేర అవకాశాలున్నాయి. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి ఈ బలం సరిపోతుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేం"
- అమర్త్యసేన్, నోబెల్ గ్రహీత
కాంగ్రెస్‌కు అది సాధ్యమే..
ఇదే ఇంటర్వ్యూలో కాంగ్రెస్ గురించీ ప్రస్తావించారు. ఈ పార్టీ బలహీనపడినప్పటికీ భారత్ విజనరీని విస్తృతం చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. మరో 15 నెలల్లో 2024 ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో అమర్త్య సేన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. అయితే...అటు ప్రతిపక్షాలు మాత్రం ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగనున్నాయన్నది ఇంకా స్ఫష్టత రాలేదు. ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటారన్నదీ తేలలేదు. ఈ ఏడాది మాత్రం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ ఎలక్షన్స్ ఉన్నాయి. "మిషన్ 2024" ఎజెండాపై అందరూ మేధోమథనం సాగిస్తున్నారు. ఈసారి బీజేపీ సెంట్రల్ ఆఫీస్‌లోనే అధికారిక సమావేశం ఏర్పాటు చేసుకుంది బీజేపీ అధిష్ఠానం. 2024 ఎన్నికల వ్యూహాలపై ఇప్పటి నుంచే ఓ స్పష్టత ఉండాలని తేల్చి చెబుతోంది అధిష్ఠానం. ఆ మేరకు సీనియర్ నేతలంతా భేటీ అవుతున్నారు. అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొని..తమ రిపోర్ట్ కార్డులు సమర్పించాల్సి ఉంటుంది. తమ రాష్ట్రాల్లో పురోగతి ఎంత వరకు వచ్చిందో స్పష్టంగా అందులో ప్రస్తావించాలి.