Letter In Blood To Yogi: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు, కారణం తెలిస్తే షాక్
Letter In Blood To Yogi: యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు
Letter In Blood To Yogi: ప్రిన్సిపల్ లైంగిక వేధింపులను తట్టుకోలేని విద్యార్థినులు రాష్ట్ర ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఘజియాబాద్‌లోని ఓ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఈరోజు వెల్లడించారు. డా.రాజీవ్ పాండే అనే ప్రిన్సిపల్ విద్యార్థినిలను వివిధ సందర్భాలలో తన ఆఫీస్‌కు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు వచ్చాయి. 12 నుంచి 15 ఏళ్లు ఉన్న అమ్మాయిలతో ఇలా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. వాళ్లు చాలా కాలం బయటకు చెప్పడానికి భయపడిపోయారని, తర్వాత తర్వాత తమ తల్లిదండ్రులు విషయం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థినులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాశారు. సదరు ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. లేఖ ద్వారా విద్యార్థులు తెలిపిన ప్రకారం.. వారు తమ కుటుంబసభ్యులకు ప్రిన్సిపల్ గురించి చెప్పిన తర్వాత వారు స్కూల్‌కి వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసినట్లు చెప్పారు. స్కూల్‌కు వచ్చిన కుటుంబసభ్యులకు, ప్రిన్సిపల్‌కు మధ్య వాగ్వివాదం జరగగా రాజీవ్ పాండే ఇష్టం వచ్చినట్లు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడంతో అతడిని పిల్లల తల్లిదండ్రులు కొట్టారు.
కాగా రాజీవ్ పాండే విద్యార్థుల తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్లోకి వచ్చి ప్రాపర్టీని ధ్వంసం చేయడంతో తనపై దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా అతడిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు తమని కొన్ని గంటల పాటు బెదిరించి నిర్భంధించారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెల్లడించారు.
మమ్మల్ని బలవంతంగా నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని విద్యార్థినిలు రక్తపు మరకలతో రాసిన లేఖలో పేర్కొన్నారు. తమను ఇక తరగతులకు హాజరుకావొద్దని స్కూల్ అధికారులు ఆదేశించారని కూడా వెల్లడించారు. అయితే ప్రిన్సిపల్ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అని, అందుకే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తమ తల్లిదండ్రులు చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రిన్సిపల్ వేధింపులకు గురైన మేమంతా ఈ సమస్యను మీతో వ్యక్తిగతంగా చర్చించాలనుకుంటున్నట్లు విద్యార్థినిలు యోగికి రాసిన లేఖలో వెల్లడించారు. మిమ్మల్ని కలిసి న్యాయం కోరడానికి తమకు, తమ తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాలని, మేమంతా కూడా మీ కుమార్తెలమే అని పిల్లలు యోగిని అభ్యర్థించారు.
ఈ ఘటన నేపథ్యంలో ఎట్టకేలకు రాజీవ్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు పై దర్యాప్తు చేస్తామని, పూర్తి విచారణ చేపడతామని ఘజియాబాద్ సీనియర్ పోలీస్ అధికారి సలోని అగర్వాల్ వెల్లడించారు.