Andhra News: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - తిరుమలలోనూ వన్య మృగాల భయం
Srisailam News: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వన్య మృగాల సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. శనివారం రాత్రి శ్రీశైలంలో చిరుత సంచారం ఆందోళన కలిగించగా, తిరుమలలోనూ చిరుత, ఎలుగు సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.
Leopard Roaming in Srisailam: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వన్య మృగాల సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. రత్నానంద స్వామి ఆశ్రమం హోమగుండం వద్ద శనివారం రాత్రి పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. హోమ గుండం గోడపై సుమారు గంట పాటు సంచరించింది. దీంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. ఈ తతంగాన్ని యాత్రికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కాగా, గత 3 నెలల కిందట ఔటర్ రింగ్ రోడ్డు లోని రుద్రా పార్క్ సమీపంలో చిరుత కనిపించింది.
తిరుమలలోనూ
అటు, తిరుమలలోనూ తాజాగా వన్యమృగాల సంచారం కలకలం రేపింది. అలిపిరి కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో రెండు వన్య మృగాలు దర్శనమిచ్చాయి. వన్య ప్రాణుల కదలికలు గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిరుత, ఎలుగు బంటి చిక్కాయి. ఈ రెండింటి కదలికలు నమోదైనట్టు గుర్తించిన టీటీడీ అధికారులు అప్రమత్తమై వన్య మృగాలు సంచరించిన ప్రాంతంలో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే నడక మార్గం, ఘాట్ రోడ్డులో చిరుత సంచారం తగ్గుముఖం పట్టిందని టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ చిరుత, ఎలుగు సంచారంతో ఉలిక్కిపడ్డారు. అటు శ్రీవారి భక్తుల్లోనూ చిరుత భయం పట్టుకుంది.
ఒకే నెలలో రెండు సార్లు
అలిపిరి కాలిబాట, శ్రీవారి మెట్టు మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారం టీటీడీని కలవర పెడుతోంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే, బాలికపై దాడి చేసి చంపేసిన దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో శ్రీవారి భక్తులు కాలిబాట మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే వణికిపోయారు. ఈ క్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా తితిదే కాలిబాటలో ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లల తల్లిదండ్రులను అనుమతించే విధంగా చర్యలు చేపట్టారు. భక్తులకు ఊతకర్ర ఇచ్చారు. ఏడో మైలురాయి నుంచి గాలిగోపురం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించారు. వంద మంది భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు పంపించింది టీటీడీ. చిరుత సంచారం ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చి ఇప్పటివరకూ 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. కానీ నిరంతరాయంగా కాలిబాట మార్గంలో ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత జాడలు గమనిస్తూనే ఉన్నారు. ఇక కాలిబాట మార్గంలో వన్యమృగాల బెడద తప్పినట్లే అని భావించే లోగా, మరోసారి చిరుత, ఎలుగు సంచారం భయాందోళనకు గురి చేస్తోంది.