Kuwait Fire Tragedy: కువైట్ అగ్ని ప్రమాదం - బిల్డింగ్ ఓనర్‌ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
Kuwait Fire Accident: ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఓనర్‌ని అరెస్ట్ చేయాలని కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Kuwait Fire Accident News Updates: కువైట్‌లోని జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా వాళ్లలో 40 మంది భారతీయులే ఉన్నారు. ఈ ఘటన రెండు దేశాల్లోనూ అలజడి సృష్టించింది. బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం వల్ల అందులో చిక్కుకుని అంతా ఆహుతి అయ్యారు. కువైట్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే బిల్డింగ్ ఓనర్‌ని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. Kuwait Times వెల్లడించిన వివరాల ప్రకారం..హోం మంత్రి షేక్ ఫహద్ అల్ యూసుఫ్ అల్ సబా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మంగాఫ్ బిల్డింగ్ ఓనర్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని తేల్చి చెప్పారు. బిల్డింగ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తినీ అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. ఇటు భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రమంత్రి క్రిత వర్ధన్ సింగ్ కువైట్‌కి చేరుకున్నారు. అక్కడి బాధితులను పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కువైట్‌కి వచ్చినట్టుగా కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
MoS @KVSinghMPGonda visited Mubarak Al Kabeer hospital in Kuwait where 7 injured Indians are admitted. MoS ascertained their well being & assured them of all support from GoI. He also appreciated hospital authorities, doctors and nurses for taking good care of the Indians. pic.twitter.com/faKtaNc9Wc
— India in Kuwait (@indembkwt) June 13, 2024
స్థానిక మీడియా కథనాల ప్రకారం..ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో 160 మంది నివసిస్తున్నారు. వీళ్లంతా ఒకటే కంపెనీలో పని చేస్తున్నారు. పరిమితికి మించి ఒకే బిల్డింగ్‌లో అందరినీ ఉంచడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఓనర్ అత్యాశ వల్లే ఇదంతా జరిగిందని మండి పడుతున్నారు. అందుకే ప్రభుత్వం యజమానిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు. మున్సిపాల్టీ నిబంధనలు కాదని నిర్మించిన బిల్డింగ్‌లను గుర్తించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ భవిష్యత్‌లో జరగకుండా చూడాలని తేల్చి చెప్పింది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. వీళ్లలో కేరళ, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. పొగ కమ్ముకుని పీల్చడం వల్ల ఊపిరాడక చనిపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కింద అంతస్తులోని కిచెన్‌లో మంటలు చెలరేగాయి. కాసేపటికే అవి బిల్డింగ్ అంతా వ్యాపించాయి. అరబ్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల్లో 20-50 ఏళ్ల మధ్య వాళ్లున్నారు. ఈ బిల్డింగ్ ఓనర్ మలయాళీ బిజినెస్‌మేన్ అని గుర్తించారు. వందల మంది కూలీలను ఇందులో కుక్కి ఉంచుతున్నారు. దీనిపైనే ప్రభుత్వం తీవ్రంగా మండి పడుతోంది. పరిమితికి మించి ఎలా ఉంచుతారని ప్రశ్నిస్తోంది.