KRMB Tour : కృష్ణాబోర్డు సీమ టూర్ చివరి క్షణంలో వాయిదా..! ఏపీ అభ్యంతరమే కారణం..!
ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనను వాయిదా వేసుకుంది. కమిటీలో తెలంగాణ వ్యక్తి ఉండటంతో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించి నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయో లేదో నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు గురువారం కేఆర్ఎంబీ కమిటీ అక్కడ పర్యటించాలనుకుంది. తమ బృందంతో కర్నూలు జిల్లా సంగమేశ్వరంకు వస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అయితే.. ఇక పర్యటన ప్రారంభమవుతుందనుకున్న కొద్ది గంటల ముందు పర్యటన వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాల మేరకే వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. సీమ ఎత్తిపోతలను పరిశీలించాలనుకున్న కేఆర్ఎంబీ బృందంలో దేవేందర్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నారని దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎన్జీటీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరూ లేకుండా కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కారణంగానే చివరి క్షణంలో కేఆర్ఎంబీ కమిటీ టూర్ వాయిదా పడిందని చెబుతున్నారు.
కృష్ణాబోర్డు పర్యటన వాయిదా పడటం ఇదే మొదటి సారి కాదు. చాలా రోజులుగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇప్పటి వరకూ పరిశీలన సాధ్యం కాలేదు. మధ్యలో తెలంగాణ సర్కార్ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామని కేంద్రానికి సమాచారం ఇచ్చింది. హెలికాఫ్టర్ సమకూరుస్తామని కేంద్రభద్రతా బలగాలతో రక్షణ తీసుకుని పర్యటించాలని కోరింది. అయితే కేఆర్ఎంబీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. చివరికి ఎన్జీటీ ఆదేశాల మేరకే మరోసారి "సీమ" ప్రాజెక్ట్ వద్ద పర్యటించేందుకు కృష్ణాబోర్డు సిద్ధమయింది. కానీ ఈ సారి కూడా ఏపీ భిన్నమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి... పర్యటనను నిలిపివేయించగలిగింది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించే విషయంలో ఏపీ ప్రభుత్వానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ముందుగా తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పరిశీలించాలని ఆ తర్వాతే ఏపీకి రావాలని వాదిస్తోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతలపైనే ఎన్జీటీలో పిటిషన్లు వేయడం అలాగే పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆ ప్రాజెక్టుపైనే కేఆర్ఎంబీ దృష్టి పెట్టింది. ఇదే అంశం తీవ్ర వివాదంగా మారడంతో విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. కానీ ఎడతెగని సీరియల్‌గా సాగుతూనే ఉంది.
కృష్ణాబోర్డును రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించేలా ఏపీ సర్కార్ చేస్తేనే వివాదం సద్దుమణుగుతుంది. లేకపోతే ఆ వివాదం అలా కొనసాగుతూనే ఉంటుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. అక్కడ నిర్మాణ పనులేమీ జరగడం లేదన్న ఏపీ ప్రభుత్వం ఎందుకో కానీ పర్యటనకు మాత్రం అనుమతించడం లేదు. ఈ కారణంగా జల వివాదం మరింత పీటముడి పడుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందని అధికారులతో అయినా కమిటీ పర్యటనకు వస్తే ఏపీ సర్కార్ సహకరిస్తే ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.