Youtube chanels : ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
ఉద్యోగులు యూట్యూబ్ చానల్స్ నిర్వహించకూడదని కేరళ ప్రభత్వం ఆదేశాలు జారీ చేసింది.
Youtube chanels : యూట్యూబ్ చానల్ అనేది ఇప్పుడు చాలా మందికి ఓ అదనపు ఆదాయ వనరు అయింది. తమ దగ్గర ఉన్న స్కిల్ లేదా మరో విధమైన టాలెంట్ ను చూపించి అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారు. ఇలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. ఇప్పటి వరకూ యూట్యూబ్ చానల్ పెట్టుకోవడానికి ఒక్క ఈమెయిల్ ఉంటే చాలు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇంక అలాంటి చాన్స్ లేదు. ఖచ్చితంగా ఎలాంటి చానల్ నిర్వహించడానికి అవకాశం లేదు. అయితే ఇది అందరికీ కాదు.. కేరళ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.
ఇటీవల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానల్‌ను నడపరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది.ఉద్యోగులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించేందుకు మాత్రమే వారి వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితమని, సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండేందుకు, యూట్యూబ్ చానల్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందేందుకు దానిని ఉపయోగించకూడదని జీవోలో పేర్కొంది.
యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే అధికారికంగా శాఖల తరరపు నిర్వహించుకోవచ్చు కానీ.. వ్యక్తిగతంగా నిర్వహించడం సాధ్యం కాదని.. ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ చానళ్లను మూసివేయాలని ఆ జీవోలో కోరింది. కేరళలో యూట్యూబ్ చానల్స్ నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అక్షరాస్యత శాతం ఎక్కువ కావడం... అక్కడ ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఒకరైనా గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ ఉండటం వంటి కారణాలతో పాటు రాజకీయంగానూ యువత ఎతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ కారణంగా యూట్యూబ్ చానల్స్ ను నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఏ మాత్రం తీసిపోలేదు.
హఠాత్తుగా.. ప్రభుత్వం యూట్యూబ్ చానల్స్ ను ఉద్యోగులు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని వేల మంది ఉద్యోగులకు షాక్ లాంటిదే. అయితే ఉద్యోగులు ఏ ఇతర ఆదాయాన్ని కూడా పొందకుండా... సర్వీస్ రూల్స్ ఉన్నాయని .. యూట్యూబ్ చానల్ ద్వారా ఆదాయం వస్తుందని.. అందుకే కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇతర ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయం పట్ల ఆసక్తి చూపిస్తే.. కొన్ని వేల మంది ఇతర రాష్ట్రాల ఉద్యోగులకూ షాక్ తప్పదు.