Karnataka Mask Advisory: మళ్లీ టెన్షన్ పెడుతున్న కొవిడ్, కర్ణాటకలో అలెర్ట్ - మాస్క్‌లు తప్పనిసరి
Karnataka Mask Advisory: వృద్ధులు కచ్చితంగా మాస్క్‌లు పెట్టుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Karnataka Covid Advisory:
కర్ణాటక అప్రమత్తం..
కేరళ సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వృద్ధులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న వాళ్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. కర్ణాటక ఆరోగ్యమంత్రి దినేశ్ గుండు రావ్ ఈ ప్రకటన చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
"కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రివ్యూ మీటింగ్ నిర్వహించాం. కేసుల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తాం. 60 ఏళ్ల పైబడిన వాళ్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతున్న వాళ్లూ మాస్క్‌లు పెట్టుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. కేరళతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాలనూ అప్రమత్తం చేశాం. మంగళూరు, చామనాజ్‌నగర్, కొడగు ప్రాంతాలను అలెర్ట్ జారీ చేశాం. శ్వాససంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి"
- దినేశ్ గుండురావ్, కర్ణాటక ఆరోగ్య మంత్రి
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవాళ్టికి (డిసెంబర్ 18) కొవిడ్ బాధితుల సంఖ్య 1,828గా నమోదైంది. కేరళలో ఒకరు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ సబ్ వేరియంట్ JN.1 (Sub Variant JN.1) వ్యాప్తి చెందుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ 4 కోట్ల 46 లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నేషనల్ రికవరీ రేటు 98.81%గా ఉంది. ఇప్పటి వరకూ ఐదున్నర లక్షల మంది కొవిడ్‌కి బలి అయ్యారు.
జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి ఈ వేరియంట్ (Covid Variant JN.1 Symptoms) లక్షణాలు. ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపించాయి. కొంత మంది బాధితుల్లో శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. నాలుగైదు రోజుల పాటు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైతే...వీలైనంత ఎక్కువగా టెస్ట్‌లు చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. అది కొవిడ్ వైరస్సా కాదా అని తెలుసుకోడానికై పరీక్షలు చేయాల్సిన అవసరముందని చెబుతున్నారు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్లలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తుండడమే ఇందుకు కారణం. అలా అని కొత్త వేవ్ వచ్చేస్తోందని భయపడాల్సిన పని లేదని అంటున్నారు వైద్యులు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌లానే వచ్చి వెళ్లిపోతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరిస్తున్నారు. అందుకే నిఘా పెంచాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించడం, టెస్ట్‌లు చేయించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా వెంటనే ఐసోలేట్ అవ్వాలి. ఇప్పటికే పలు వేరియంట్‌లు ప్రపంచాన్ని వణికించాయి. ఇప్పుడు మరో వేరియంట్ గుబులు పెంచుతోంది. ఇకపై ఇంకెన్ని వేరియంట్‌లు వస్తాయో స్పష్టత లేదు. కానీ ఎప్పుడైనా వైద్యులు మాత్రం జాగ్రత్తగా ఉండడమొక్కటే మందు అని చెబుతున్నారు.
Also Read: Dawood Ibrahim Poisoned: దావూద్ ఇబ్రహీంని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార్చిన కేసులు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

