Karnataka Election 2023 Dates:కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఖరారు, తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం
Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Karnataka Election 2023:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ఆఖరు తేదీ ఏప్రిల్ 20గా నిర్ణయించిన ఈసీ..21వ తేదీన వాటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 24 ఆఖరి గడువుగా ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తైన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని వెల్లడించింది. 80 ఏళ్లు దాటిన వారెవరైనా...ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించింది. వోట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ఇదే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. 2018-19 నుంచి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. 9.17 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే..ఏడాదిన్నర తరవాత పరిణామాలు మారిపోయాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది.
కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు కలిపి 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,976 మంది శతాధిక వృద్ధులు, 4,699 మంది థర్డ్ జెండర్లు, 9.17 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో ( Karnataka Election 2023 Date) 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు నాలుగోవంతు ఉన్న 51 రిజర్వ్‌డ్ స్థానాలు కీలక పాత్ర పోషిస్తాయి. అత్యధిక రిజర్వ్‌డ్ స్థానాలను గెలుచుకున్న పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గత ఎన్నికలు నిరూపించాయి. 51 సీట్లలో 15 షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ), 36 షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వు చేయబడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారీ, బీజేపీతో పోలిస్తే రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య పరంగా దాని పనితీరు మెరుగ్గా ఉంది. 2008లో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు, 51 రిజర్వ్‌డ్ స్థానాల్లో 29 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది, కాంగ్రెస్ 17 కైవసం చేసుకుంది. 2013లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ రిజర్వ్‌డ్ స్థానాల్లో 27 గెలుచుకుంది. బీజేపీకి కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
కాగా.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని హుంగుండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం అందించడానికి తాను చిత్తశుద్ధితో పనిచేశానని, ఫలితంగా వార్షిక తలసరి ఆదాయం రూ.1 లక్షకు పెరిగిందని తెలిపారు. 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త, లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు సూచించిన ‘పనే దైవం’, సామాజిక సమానత్వం అనే మార్గంలో తాను నడుస్తున్నానని సీఎం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప సహా 124 మంది అభ్యర్థులను శనివారం ప్రకటించింది. శివకుమార్ మూడుసార్లు గెలిచిన కనక్‌పురా నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయనుండగా, సిద్ధరామయ్య ప్రస్తుతం ఆయన కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మైసూరులోని వరుణ నుంచి బరిలోకి దిగనున్నారు. కోలారు నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన మునియప్ప తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన దేవనహళ్లి నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. మునియప్ప విషయంలో, గత ఏడాది జైపూర్‌లో జరిగిన ప్లీనరీ సెషన్‌లో ఆమోదించిన 'ఒక కుటుంబం-ఒకే-టికెట్' నిబంధనను కాంగ్రెస్ పట్టించుకోలేదు. దీంతో కోలార్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమార్తె రూపకళ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
మరోవైపు.. కర్నాటక ఎన్నికల సందర్భంగా లెక్కల్లో చూపని నగదు, ఉచిత వస్తువుల పంపిణీని అడ్డుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ గత వారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు ముగిసే వరకు కంట్రోల్ రూమ్ 24/7 పని చేస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఎన్నికల నిర్వహణను ప్రభావితం చేసే నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల తరలింపుపై గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.