(Source: Poll of Polls)
AP Volunteers: వైసీపీకి సహకరించకపోతే పోస్టుల నుంచి తొలగిస్తాం: వాలంటీర్లకు ఎంపీపీ వార్నింగ్
AP Ward Volunteers: వైసీపీకి ఓట్లు వేసే విధంగా వాలంటీర్లు సహకరించాలని, లేకుంటే వారిని పోస్టుల నుంచి తొలగిస్తానని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎంపీపీ దంతులూరి ప్రకాశం హెచ్చరించారు.
AP Grama Volunteers: ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తీసుకున్న కీలక నిర్ణయాలలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాది సమయంలోపే లక్ష గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. ఈ వాలంటీర్లను జగన్ ప్రభుత్వం వైసీపీ పనులకు వాడుకుంటోందని ఎప్పటినుంచో విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వైసీపీ నేత వాలంటీర్లకు ఇచ్చిన వార్నింగ్ అది నిజమేననే సంకేతాలు ఇస్తోంది. ప్రజలు వైసీపీకి ఓట్లు వేసేలా వాలంటీర్లు పార్టీకి సహకరించకపోతే తొలగిస్తామని ఎంపీపీ దంతులూరి ప్రకాశం వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా కనిగిరి మండల పరిషత్ కార్యాలయలో స్థానిక ఎంపీపీ దంతులూరి ప్రకాశం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలోని 25 పంచాయతీలకు చెందిన గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమావేశానికి హాజరయ్యారు. వాలంటీర్లు వైపీపీ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం. గడప గడపకు వెళ్లి వాలంటీర్లు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకే ఓట్లు వేసేలా చేయడం వాలంటీర్ల పని అని, స్థానికంగా ఉన్న వాలంటీర్లు అందుకు తమ వంతుగా సహకరించాలన్నారు. అలా చేయని పక్షంలో ఆ వాలంటీర్లను పోస్ట్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. వాలంటీర్లను తొలగించేందుకు తనకు హక్కులు సైతం ఉన్నాయని ఎంపీపీ అన్నారు.
వాలంటీర్లకు వేతనం పెంచే యోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నారని, గతంలో లేని కొత్త వ్యవస్థకు నాంది పలికింది ఆయనేనన్నారు. లక్షకు పైగా యువతకు వాలంటీర్ల వ్యవస్థతో ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్ అన్నారు. త్వరలో జరగనున్న ఏపీ బడ్జెట్ సమావేశాలలో వాలంటీర్ల వేతనం పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంటారని సమావేశంలో ప్రస్తావించారు ఎంపీపీ దంతులూరి ప్రకాశం. వాలంటీర్లకు ప్రొబేషన్ టైమ్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహించి పర్మినెంట్ చేయడం లాంటి నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకోవడం తెలిసిందే. ఉద్యోగాలు అని చెప్పి తమను తీసుకుని ఇప్పుడు పూర్తిగా పార్టీ సేవల కోసం పనిచేయిస్తున్నారని వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు.