Kakinada News: కరోనా భయంతో ఇంటికే పరిమితం అయిన తల్లీకూతుళ్లు - దాదాపు మూడేళ్లుగా చీకట్లోనే జీవనం!
Kakinada News: కరోనా భయంతో ఓ తల్లీ, కూతురు నాలుగేళ్లుగా చీకటి గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామని బయటకు రావడమే మానేశారు. చివరకు ఏమైందంటే..?
Kakinada News: కరోనా.. ఈ పేరు వింటేనే చాలా మంది వణికిపోయారు ఒకప్పుడు. ఇప్పటికీ ఆ పేరు వింటే చాలా మంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే కరోనా సోకి వారు పడ్డ ఇబ్బందులు, తమ వాళ్లను పోగొట్టుకొని అనాథలు అయిన వారిలో ఇంకా కరోనా వైరస్ భయాలు పోలేదు. కానీ ఆ తల్లీ, కూతుళ్లకు ఇప్పటికీ కరోనా అంటే వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే దాదాపు మూడేళ్ల నుంచి పడక గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామంటూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా చీకట్లోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ వింత ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన తల్లి మణి, కూతురు భవాని కరోనా భయంతో బయటకి రావడమే మానేశారు. ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల నుంచి బెడ్ రూంలో చీకట్లోనే ఉంటున్నారు. అయితే తల్లి మణి తీవ్ర అనారోగ్యం పాలవ్వగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో వైద్య సిబ్బంది వచ్చి వీరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు దుప్పటి ముసుగు లోనుంచి బయటకు రాకుండా బయట కరోనా ఉందని, తాము కరోనా వచ్చి చనిపోతామని చెబుతుండడం గమనార్హం. కరోనా భయం అనే మానసిక ఫోబియాతో వీరు ఇంటి ప్రధాన ద్వారం వద్దకు కూడా రాలేదని చెబుతున్నారు. 24 గంటలూ గదిలోనే బందీలుగా ఉంటున్నారని స్థానికులు అంటున్నారు.
వీరుంటున్న వీధిలో కరోనా రావడంతో..
2020లో కరోనా మొదటి వేవ్‌లో కుయ్యేరులోని మణి, భవానీలు ఉంటున్న ఇంటి సమీపంలోనే ఒకరికి కరోనా సోకింది. అప్పట్లో కరోనా సోకిన ప్రాంతమంతా ఎవ్వరూ బయటకు రాకూడదని ప్రచారం జరగడంతో పాటు ఆప్రాంతం అంతా రాకపోకలు నిషేధించారు. దీంతో కరోనా భయంతో ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు తల్లీకూతురు. మణి, భవానీలు అదే భయంతో ఆనాటి నుంచి ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టారు. కరోనా భయం ఫోబియాగా మారి బయటకు వస్తే కరోనా వచ్చి మరణిస్తామని బలంగా మనసులో నాటుకుపోవడంతో అక్కడకు ఎవ్వరు వెళ్లినా దుప్పట్లో ఉండే మాట్లాడుతూ కరోనా వస్తుంది, వెళ్లిపొమ్మని అంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
రెండు గంటల పాటు శ్రమించి ఆసుపత్రికి..
దాదాపు మూడేళ్ల నుంచి గదికే పరిమితిమైన తల్లీకూతుర్లు అనారోగ్యం పాలవ్వగా తల్లి మణి పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది వచ్చి ఎంత ప్రయత్నించినా వాళ్లు సహకరించలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరిలించారు. అయితే తండ్రి వీరికి వండి పెట్టడం, లేదా బయట నుంచి ఆహారాన్ని తీసుకురావడం జరుగుతుండగా.. కరోనా తగ్గిపోయిందని చెబుతున్నప్పటికీ వారు బయటకు రాలేదని, వాళ్లే మెళ్లిగా మారుతారని అనుకుంటున్నాని ఆయన చెప్పారు. అయితే ఆరోగ్యం బాగోకపోయినా వీరి పరిస్థితి మారకపోవడంతో చివరకు స్థానిక సర్పంచ్, పక్కింటి వారికి చెప్పానని తండ్రి తెలిపాడు.