Kabul News: అయ్యో ఈ పసి పిల్లలకు ఎంత కష్టమొచ్చింది, బడి మానేసి బట్టీల్లో పనులు
Kabul News: అఫ్ఘనిస్థాన్‌లో చిన్నారులు బడులు మానేసి ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారు.
Kabul News:
అఫ్ఘనిస్థాన్‌లో దీన స్థితి..
తాలిబన్ల ఆక్రమణ తరవాత అప్ఘనిస్థాన్ పరిస్థితి ఎంత దిగజారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి...తిండి దొరక్క అలమటిస్తున్నారు అక్కడి ప్రజలు. మహిళలపైనా ఆంక్షలు తీవ్రమయ్యాయి. చేసేందుకు పని దొరకటం లేదు. పొట్ట పోషించుకోటానికి తిప్పలు పడుతున్నారు. పెద్దలతో పాటు చిన్నారులకూ "పని" కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు కూలీ పనులు చేసుకుంటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బాలకార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. Save the Children సర్వేలో కొన్ని ఆందోళనకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. అఫ్ఘనిస్థాన్‌లో సగం కుటుంబాలు తమ పిల్లల్ని పనులకు పంపుతున్నట్టు వెల్లడైంది. మూడు పూటలా తిండి దొరకాలంటే ఇలా చేయక తప్పని దుస్థితోల ఉన్నారంతా. కాబూల్‌లో ఎన్నో ఇటుక బట్టీలున్నాయి. వాటిలో పని చేసే వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉంటున్నారు. సాధారణంగా...ఇటుక బట్టీల్లో పని చేయటానికి పెద్దలే జంకుతారు. ఆ వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది...ఇక్కడ చిన్నారులూ బట్టీల్లో చెమటోడ్చుతుండటం అక్కడి దీనస్థితికి అద్దం పడుతోంది. తెల్లవారుజామున నుంచి మొదలు పెట్టి చీకటి పడేంత వరకూ ఇలా బట్టీల్లోనే మగ్గిపోతున్నారు చిన్నారులు. ఇటుకలు తయారు చేసే ప్రాసెస్‌లో ప్రతి దశలోనూ చిన్నారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీళ్లు మోయటం, ఇటుకలు తయారు చేయటం లాంటివే కాకుండా...ఇటుకలను మంటలో వేసి కాల్చే అత్యంత కష్టమైన పనినీ చేస్తున్నారు. ప్రతి చోట ఇలా బరువులు మోసే పనులు చేస్తూ అలిసిపోతున్నారు చిన్నారులు.
లక్షలాది మంది చిన్నారులు..
చేతులు బొబ్బలెక్కుతున్నా, భుజాలు నొప్పి పెడుతున్నా...కుటుంబం కోసం తప్పదని నిరంతరం శ్రమిస్తున్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో ఇలా బట్టీలకు పరిమితమవుతున్నారు. ఇంత చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తున్న వాళ్లను చూస్తే గుండె తరుక్కుపోతుంది.
ఆటల గురించో, ఆటబొమ్మల గురించో వాళ్ల దగ్గర ప్రస్తావిస్తే నవ్వేసి ఊరుకుంటున్నారు. ఎవరో కొద్ది మంది మాత్రమే బడికెళ్లి చదువు కుంటున్నారు. ఓ 12 ఏళ్ల అమ్మాయిని "ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నావ్" అని ప్రశ్నిస్తే...తన ఐదో ఏడాది నుంచే పని చేస్తున్నట్టు సమాధామనమిచ్చింది. ఈ ఒక్క చిన్నారే కాదు. అక్కడ ఎవరిని కదిలించినా ఇదే సమాధానం చెబుతున్నారు. ఏళ్లుగా అలా బాల కార్మికులుగా బాధలు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ బడికి వెళ్లిన వారు కూడా ఇప్పుడు కుటుంబం కోసం పనులు చేస్తున్నారు. పని గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. "నాకు స్కూల్‌కు వెళ్లాలనుంది. ఇష్టమైనవన్నీ తినాలని ఉంది" అని ఆ చిన్నారులు అంటున్నారు. సేవ్ ది చిల్డ్రన్ సర్వే ప్రకారం...గతేడాది డిసెంబర్‌తో పోల్చుకుంటే...ఈ జూన్ నాటికి పని పిల్లలుగా మారిన వారి సంఖ్య 18% నుంచి 22%కి పెరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది చిన్నారులు ఇలానే చెమటోడ్చుతున్నారు. మరో 22% మంది చిన్నారులు...తల్లిదండ్రుల వ్యాపారంలోనో లేదంటే వ్యవసాయంలోనే సాయంగా నిలుస్తున్నారు. 7 ప్రావిన్స్‌లలో బాలకార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
Also Read: Cricket Tickets Issue: హెచ్‌సీఏపై పోలీసులు సీరియస్, అజారుద్దీన్ తో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు
Also Read: Bigg Boss Telugu: గీతూకు కన్నుకొట్టిన రాజశేఖర్, ఫీలైన ఫైమా - ఆరోహి ఏడుపు