సీఎం జగన్‌ను శత్రువుగా ప్రకటించుకున్న పాల్- పవన్‌కు తానే రోల్ మోడల్ అంటూ కామెంట్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడం మంచి పరిణామమని కేఏ పాల్ అన్నారు. కోమటిరెడ్డి బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.
ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డితో తనకు నేటి నుంచి శత్రుత్వం మొదలైందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్ధాపకుడు కేఏ పాల్ ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాల్.. అధికార పార్టీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో శత్రుత్వం మొదలైందన్న పాల్... ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే పోలీసులు తనను టార్గెట్ చేసుకున్నారు. పోలీసులు తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని వెల్లడించారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ విద్యార్థినులను కలిసి ఆశీర్వదించానే తప్ప... వారితో తప్పుగా ప్రవర్తించలేదని తెలిపారు. విశ్వవిద్యాలయ సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించలేదని, అసలు పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం హాస్టల్‌లోకి వెళ్లనేలేదని ఆయన వివరణ ఇచ్చారు.
కేఏ పాల్.. సీఎం అంటూ నినాదాలు చేశారు..
వైసీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ తనను తప్పుదారి పట్టించారని.. కేఏ పాల్ సీఎం అని విద్యార్థులు నినాదాలు చేస్తుండగా జీర్ణించుకోలేక పోయారన్నారు. మహిళా విశ్వ విద్యాలయంలో ఉండగానే పోలీసులకు వైసీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ఫోన్ చేసి చెప్పారని వివరించారు. ఎం.ఆర్.పల్లి సీఐ సురేందర్ రెడ్డి తనపై చేయి చేసుకున్నట్లు కే.ఏ.పాల్ చెప్పారు. తనకు జరిగిన అవమానానికి సీఐ సురేందర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు చిత్తశుద్థి ఉంటే తనపై జరిగిన దాడికి వెంటనే స్పందించాలని అన్నారు. మూడు రోజుల్లో జగన్ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తానని కే.ఏ.పాల్ హెచ్చరించారు.
కావాలనే సీఎం జగన్ దాడి చేయించారు: పాల్
జగన్ అక్రమాస్తుల విషయంలో సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడానని, జగన్‌కు ఎన్నో సార్లు సపోర్ట్ చేశానని, అలాంటి తనపై సీఎం దాడి చేయించారని కేఏ పాల్ ఆరోపించారు. కడప జిల్లాకు రోడ్డు మార్గం గుండా వస్తున్నామని, సాయంత్రం కడప నగరంలో సభ పెట్టామని తెలిపారు. దమ్ముంటే సీఎం తనను ఆపగలరా అని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది సీఎం జగనే అంటూ ఆరోపించారు. ప్రస్తుతం అప్పు 8 లక్షల కోట్లకు చేరుకుందని.. ఇకపై అప్పు ఇచ్చే వాళ్లు కూడా లేని దౌర్భాగ్య స్థితికి చేరుకున్నామని విమర్శించారు. తనను రోల్ మోడల్‌గా తీసుకుంటానని చెప్పిన పవన్ కల్యాణ్ తన పార్టీతో ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు..
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేఏ పాల్ అన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నారని.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పూర్తిగా పతనమైన పార్టీ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కే.ఏ.పాల్ విమర్శించారు.