KA Paul: అభివృద్ధి కావాలంటే కేఏ పాల్, అడుక్కుతినాలంటే ఇప్పుడున్నోళ్లకి ఓట్లేయండి - కేఏ పాల్
ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 లక్షల కోట్లు, తెలంగాణలో రూ.10 లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయాయని కేఏ పాల్ అన్నారు.
రామరాజ్యం తీసుకోస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అంటారని, రామరాజ్యం వచ్చేసిందని సీఎం జగన్ అంటుంటారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎద్దేవా చేశారు. తనకు అవకాశం ఇస్తే అనంతపురాన్ని అమెరికా చేసి చూపిస్తానని అన్నారు. 5 సంవత్సరాల్లో తాను చెప్పింది నెరవేరుస్తానని అన్నారు. ప్రభుత్వాసుపత్రులు, స్కూళ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లాలని కేఏ పాల్ అన్నారు. కేఏ పాల్ అధికారంలోకి వస్తేనే రాయలసీమ, తెలంగాణ డెవలప్ అవుతుందని ముగ్గురు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఇద్దరు మినిస్టర్లు, టీడీపీ ఎంపీ కూడా తనతో చెప్పారని అన్నారు. తెలుగు ప్రజలందరూ కేఏ పాల్‌నే కోరుకుంటున్నారని అన్నారు. ఆదివారం కేఏ పాల్ అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 లక్షల కోట్లు, తెలంగాణలో రూ.10 లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయాయని అన్నారు. ‘‘వీళ్లు మీకు కావాలా? వాళ్ల పాదయాత్రలకా మీరు వెళ్తారు? రూ.200 బీర్లు, రూ.వంద బిర్యానీలకు వారికి అమ్ముడుపోతారా? ఈ కుటుంబ పాలనకా? ఒక్క కుటుంబం వందల వేల ఎకరాలు కబ్జా చేస్తోంది. మీ అవినీతి పాలన జరగనివ్వనని నడిరోడ్డుపైన చెబుతున్నా. 0013468126546 నెంబరుకి ఫోన్ చేసి పార్టీలో జాయిన్ అవ్వండి. ప్రతి గ్రామం, కులం నుంచి ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే ఆ నెంబరుకు ఫోన్ చేయండి. వచ్చే ఆదివారం నేను సూర్యాపేటకు వెళ్తాను. 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో ఉంటాను. ఎప్పుడైనా నేను మీకు అందుబాటులో ఉంటాను. అభివృద్ధి కావాలంటే కేఏ పాల్ రావాలి. అడుక్కుతినాలంటే ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఇప్పుడున్న వాళ్లకి మళ్లీ ఓటేయండి. ఓటేయడం మానేయండి కానీ, ఇప్పుడు ఉన్న వారికి ఓటు వెయ్యకండి.
సమస్యలను పరిష్కరించిన ఒక్క ముఖ్యమంత్రైన రాయలసీమలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తాను పల్లెటూర్లలో కూడా పర్యటించానని, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ప్రస్తుతం 30 - 40 శాతం మంది సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని కేఏ పాల్ అన్నారు. ఉద్యోగులకు జీతాలు లేవని అన్నారు. ‘‘అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణలో అన్ని జిల్లాలు తిరిగా ప్రతి చోట పేదరికమే ఉంది. గతంలో నేను హెలికాప్టర్లలో తిరిగా. అప్పుడు అంతా పచ్చగా కనిపించేది. ఇప్పుడు అసలు విషయాలు అర్థమవుతున్నాయి. రోడ్లు వేయలేని, ఉద్యోగాలు ఇవ్వలేని, రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రులు కబుర్లు ఆడుతున్నారు. డబ్బులు ఏం చేశారు? మీరంతా రాయలసీమలోనే పుట్టి పెరిగారు కదా? ఒక్క డెవలప్ మెంట్ అయినా చేశారా? ఒక కియా కంపెనీ వచ్చింది. కనీసం అనంతపురంలో పుట్టి పెరిగిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లడానికి ఎన్ని గంటలు పడుతుంది? రోడ్ల పరిస్థితి అతి దారుణంగా ఉంది’’ అని అన్నారు.