Telangana News: తెలంగాణలో JSW రూ.9 వేల కోట్ల పెట్టుబడి, దావోస్‌లో కుదిరిన ఒప్పందం
Telangana News: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమై ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు.
JSW Announces Rs 9000 crore Investment in Telangana: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9 వేల పెట్టుబడులకు రెడీ అయింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో తెలంగాణ పెవిలియన్‌లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమై ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు.
ప్రతిపాదిత పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముంబయిలో ప్రధాన కార్యాలయం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనేది థర్మల్, హైడ్రో, సౌర వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా.. ఇది 4,559 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశంలో అతిపెద్ద స్వతంత్ర జల విద్యుత్ ఉత్పత్తిదారుగా కూడా ఉంది.
JSW నియో ఎనర్జీ అనేది JSW ఎనర్జీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఇది పునరుత్పాదక, నూతన ఇంధన విధానాలపై దృష్టి సారిస్తుంది. నియో ఎనర్జీ అనేది తెలంగాణలో ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను JSWకి తాము అందిస్తున్నామని హామీ ఇచ్చారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ దిశగా రాష్ట్ర ప్రయాణంలో JSW కీలక భాగస్వామి అని, భారతదేశంలో వారి భవిష్యత్ ప్రాజెక్టుల కోసం JSWతో సహకరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ JSWకి ఇచ్చిన హామీలకు, తమ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో JSW వేగంగా విస్తరిస్తుందని, రాష్ట్రంలో తన ఉనికిని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ఐటీఈ అండ్ సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.