Japan News: నైట్ షిఫ్టు నిషేధంతో రెట్టింపు ఆదాయం- ప్రపంచదేశాలకు పాఠాలు నేర్పుతున్న జపాన్ కంపెనీ
Japan News: జపాన్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో నైట్ షిఫ్టులను నిషేధించడంతో ఉద్యోగుల సంతానోత్పత్తి రేటు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.
Japan News: తీవ్రస్థాయిలో జనాభా క్షీణతను ఎదుర్కుంటున్న దక్షిణ కొరియా, జపాన్, చైనా దేశాలు సంతానోత్పత్తిని పెంచుకోవడానికి అనేర రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పౌరులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా జననాల రేటు క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ విషయం ఆయా దేశాల ప్రభుత్వాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే దశాబ్దం క్రితం జపాన్ లోని ఓ సంస్థ సీఈఓ తీసుకున్న నిర్ణయాలు ఊహించని ఫలితాలను ఇస్తున్నట్లు వెల్లడి అయింది.
నైట్ షిఫ్టుతోపాటు రాత్రి ఎనిమిది తర్వాత పని చేయడానికి వీలు లేదని ఇటోచు కార్పొరేషన్ నిషేధం విధించిన పదేళ్ల అనంతరం కంపెనీలో మహిళా ఉద్యోగుల సంతాన సాఫల్య రేటు రెండింతలు అయింది. కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 2022 నాటికి ఇద్దరు పిల్ల చొప్పున ఫెర్టిలిటీ రేటు పెరిగిందని గుర్తించారు. అయితే జపాన్ లో సంతాన రేటు 1:3 ఉండగా.. నైట్ షిఫ్టు నిషేధించడంతో ఈ కంపెనీ ఉద్యోగులు దీన్ని అధిగమించారు. నైట్ షిఫ్టు తీసేయడంతోపాటు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కల్పించారు. అలాగే కార్యాలయ పని గంటలను కూడా ఎనిమిది గంటల నుంచి ఆరు గంటలకు కుదించారు. దీంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి పనిలో క్వాలిటీ పెరిగినట్లు గుర్తించారు.
రాత్రి ఎనిమిది దాటితే అస్సలే పని చేయకూడదు..!
2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈఓగా మషిహిరో ఒకపుజి నియమితులు అయ్యాక రాత్రి ఎనిమిది దాటితే అస్సలు ఆఫీసులో ఉండడానికి వీలు లేదని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనుకోని పరిస్థితులు మినహా నైట్ ఓవర్ టైమ్ ను కూడా రద్దు చేశారు. దీంతో ఈ కంపెనీలో విపరీతంగా లాభాలు పెరిగాయి. ఫ్యామిలీ మార్ట్ నుంచి మెటల్స్ ట్రేడింగ్ వరకు అన్నింట్లో అత్యధిక లాభాలను సాధించింది. 2010 నుంచి 2021 వరకు కోట్లలో లాబాలను పొందింది. ఈ పదేళ్ల కాలంలో చాలా మంది మహిళలు మెటర్నిటీ లీవులు తీసుకొని పిల్లల్ని కని.. తిరిగి పని చేసేందుకు వచ్చినట్లు కంపెననీ యాజమాన్యం వెల్లడించింది. తాము ఉత్పాదక పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బర్త్ రేటుపై ప్రభావం చూపుతుందని తాము అస్సలే ఊహించలేదని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైప్ ప్రెసిడెంట్ పుమిహికో కొబయషి చెప్పుకొచ్చారు.
ఇదే మహిళల్లో సంతానోత్పత్తి పెంచింది..!
కఠినమైన వర్క్ కల్చర్ గా పేరొందిన జపాన్ లో ఎక్కువ గంటల పాటు కార్యాలయాలకే పరిమితం కావడం, పని ఒత్తిడితో 25 నుంచి 30 ఏళ్ల మహిళలంతా ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంత మంది తల్లులు తమ పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాన్ని వదులు కోవాల్సి వస్తుందని చెబుతున్నాియ. ఈక్రమంలోనే పని వేళలను సాయంత్రం 8 గం నుంచి 6 గంలకు కుదిస్తూ.. ఇటోచు సంస్థ తీసుకున్న నిర్ణయం మహిళా ఉద్యోగులకు ఆశాదీపంగా మారింది. చిన్న పిల్లల సంరక్షణ కోసం ఆఫీస్ దగ్గర్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం, పని వేళలు మార్చడం వంటి నిర్ణయాలతో పాటు పిల్లల సంరక్షణ కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం చాలా మహిళా ఉద్యోగులను పెంచడంలోనూ, వారిలో సంతానోత్పత్తిని పెంచడంలోనూ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన జపాన్ ప్రభుత్వం చేస్తోంది. దీనిపై నిపుణుల సలహాలు సూచనలు స్వీకరిస్తోంది.