JSP For Roads : రేపట్నుంచి రోడ్లపై ఉద్యమం.. జనసైనికులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన సందేశం ఇదే..!
ఏపీలో రోడ్ల పరిస్థితిని మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోల ద్వారా బయట పెట్టాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసైనికులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక సందేశం విడుదల చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. హ్యాష్ ట్యాగ్ ఖచ్చితగా #JSPFORAP_ROADS అని ఉండాలని .. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తేదీన మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని ప్రకటించారు.
పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా సందేశాన్ని వీడియో ద్వారా పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలలని.. కానీ ఏపీలో మాత్రం అడుగుకో గుంత... గజానికో గొయ్యిలా ఉందన్నారు. తాను స్వయంగా పర్యటించినప్పుడు తనకు రోడ్ల దుస్థితిపై పరిస్థితి అవగాహనకు వచ్చిందన్నారు. నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చూశానని తెలిపారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు మా ఊరే కాదు నియోజకవర్గం మొత్తం రోడ్లు ఇలానే ఉన్నాయని చెబుతున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు లక్షా 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు దెబ్బ తిన్నా బాగు చేయడం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసులతో లాఠీ ఛార్జీలు చేయించే పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్నించిన జన సైనికుల్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారని పవన్ విమర్శించారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నందుకే లాఠీచార్జ్ చేయడం, అక్రమకేసులు పెట్టడం చూసి బలంగా గొంతు వినిపించాలని జనసేన నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంతలు పడ్డ రోడ్ల మీద ప్రయాణం చేసి రోజు చాలా మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు గాయాలపాలై ఆస్పత్రిలో చేరుతున్నారు. మరికొంతమంది చావు దగ్గర వరకు వెళ్లి తిరిగొస్తున్నారని ఇవన్ని చూసి ఆవేదన కలుగుతోదన్నారు.
అడుగుకో గుంత... గజానికో గొయ్యి - JanaSena Chief Shri @PawanKalyan #JSPForAP_Roads pic.twitter.com/vPzD9nF46I
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2021
ప్రభుత్వం రోడ్లను బాగు చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతోంది కానీ రోడ్లు మాత్రం బాగుపడటం లేదు. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలకు దిగుతున్నాయి. జనసేన పార్టీ వినూత్నంగా శ్రమదానతో రోడ్లను బాగు చేయాలని నిర్ణయించుకుంది.