Jaishankar on PAK: మీరు పెంచుకున్న పాములే మిమ్మల్ని కాటేస్తాయ్ - పాక్ ఉగ్రవాదంపై జైశంకర్ కౌంటర్
Jaishankar on PAK: యూఎన్ వేదికగా జైశంకర మరోసారి పాక్‌కు గట్టి బదులిచ్చారు.
Jaishankar on PAK:
పాక్ విదేశాంగ మంత్రిపై సెటైర్లు..
ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి పాక్‌పై విరుచుకు పడ్డారు భారత విదేశాంగమంత్రి జైశంకర్. పదేపదే కశ్మీర్ విషయంలో భారత్‌ను వేలెత్తి చూపుతున్న దాయాదికి కౌంటర్ ఇచ్చారు. "ప్రపంచమంతా పాకిస్థాన్‌ను ఉగ్రకేంద్రంగానే చూస్తోందన్న విషయం మర్చిపోవద్దు" అంటూ విమర్శించారు. పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ చేసిన వ్యాఖ్యలపై మండి పడ్డారు. "భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది" అంటూ ఆయన చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు. హీనా రబ్బానీ కామెంట్స్‌పై ఏమంటారు..? అని మీడియా ప్రశ్నించగా గట్టి బదులిచ్చారు జైశంకర్.
"రబ్బానీ ఓ విషయం గుర్తు చేసుకోవాలి. దశాబ్దం క్రితం జరిగిన ఘటనను ఇప్పుడోసారి గుర్తు చేసుకుందాం. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఓ సారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కీలక ప్రసంగం చేశారు. మీరు పాముల్ని పెంచుకుంటున్నారు. అవి కేవలం ఇరుగు పొరుగు వాళ్లను మాత్రమే కాటేస్తుందని అనుకోకండి. తమను పెంచుకునే వాటినీ కాటేసే గుణం వాటికి ఉంటుందని పాకిస్థాన్‌కు చురకలంటించారు" అని అన్నారు జైశంకర్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్...ఎప్పుడో ఒకప్పుడు ఆ ఉగ్రవాదానికే బలి కాక తప్పదని ఆమె మాటల్లోనిఅంతరార్థం. ఇప్పుడిదే మాటల్ని యూఎన్ వేదికగా గుర్తు చేసి పాక్‌కు గట్టి బదులిచ్చారు. ఇదే సమయంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకూ చాలా వ్యూహాత్మంకగా సమాధానమిచ్చారు. "ఇంకెన్ని రోజులు న్యూఢిల్లీ, లాహోర్ మధ్య ఈ యుద్ధం కొనసాగుతుంది..? ఇది కొలిక్కి వచ్చే అవకాశం లేదా..?" అని ప్రశ్నించాడు. దీనికి జైశంకర్ "మీరీ ప్రశ్న అడగాల్సిన వ్యక్తిని అడగటం లేదు. పాకిస్థాన్ మంత్రిని ఇదే క్వశ్చన్ అడగాల్సింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఎప్పుడు ఆపేస్తారో సరిగ్గా సమాధానమిస్తారు" అని ఘాటుగా స్పందించారు.
వరుస కౌంటర్‌లు..
ఇప్పటికే ఓ సారి పాక్‌కు గట్టి సమాధానమిచ్చారు జైశంకర్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ లేవనెత్తడంతో వార్నింగ్ ఇచ్చారు.
" అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన దేశానికి, పొరుగున ఉన్న పార్లమెంటుపై దాడి చేసిన దేశానికి.. ఇప్పుడు ఐరాస సమావేశంలో నీతులు వల్లించే అర్హత లేదు. "
- ఎస్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి, వాతావరణ మార్పు, సంఘర్షణలు లేదా ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లకు ప్రభావవంతమైన ప్రతిస్పందనపై ఐరాస విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని జై శంకర్ అన్నారు. ఈ అంశంపై భద్రతా మండలిలో బుధవారం మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి జై శంకర్ దీటుగా బదులిచ్చారు. చైనా, పాకిస్థాన్‌లపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు.
" ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సమర్థించేందుకు.. వారికి సహాయం చేసేందుకు బహుముఖ వేదికలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకున్న దేశాలకు వత్తాసు పలుకుతున్నారు. "
- ఎస్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
Also Read: Arunachal CM On Tawang Clash: 'ఇది 1962లోని నెహ్రూ పాలన కాదు- ఇప్పుడు మోదీ యుగం'