Gaza News: గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్- కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం
Israel News: పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్, హమాస్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించాయి. 4 రోజుల క్రితం గాజాలో చిన్నారి పోలియో వచ్చినట్టు నిర్ధారించారు.
Polio vaccination Drive In Gaza: ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించారు. పోలియో వ్యాక్సినేషన్ కోసం కాల్పులు విరమణ జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. కాల్పుల విరమణకు ఇరువురు అంగీకరించారు. గాజాలోని ప్రతి జోన్ పరిధిలో మూడు రోజులపాటు పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. దీంతో ఈ మూడు రోజులు కాల్పుల విరమణకు తాత్కాలిక బ్రేక్ ఏర్పడింది. మొదట సెంట్రల్ గాజాలో, రెండో విడతగా దక్షిణ గాజాలో, ఆఖరిగా ఉత్తర గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా దాదాపు 6.40 లక్షల మంది పాలస్తీనా చిన్నారులకు పోలియో టీకాలు వేయనున్నారు.
గాజాలో 10 నెలల చిన్నారికి పక్షవాతం
పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆదివారం ప్రారంభం కానుంది. గాజా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి రిక్ పీపర్ కార్న్ తెలిపారు. ఈ డ్రైవ్‌ను మూడు రోజులపాటు జరపాలని అనుకున్నా గత అనుభవాలను బట్టి అదనపు రోజులు అవసరం అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాలో నెలకొన్న పరిస్థితులపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గాజాలో ఇటీవల టైప్ 2 పోలియో వైరస్ కేసు నమోదైంది. 10 నెలల చిన్నారి పక్షవాతానికి గురైనట్టు ఆగస్టు 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. 25 ఏళ్లలో గాజాలో ఇదే తొలి పోలియో కేసు ఇదే కావడం గమనార్హం. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదివారం నుంచి పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సన్నద్ధమైంది.
Also Read:అమెరికా ఎన్నికల్లో ఉచిత హామీలు- IVF ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ట్రంప్ క్రేజీ ఆఫర్