Kids In Earlier Age: ఏపీలో పాతికేళ్లకే ఇద్దరు పిల్లలు- జాతీయ సగటు 30 సంవత్సరాలు- మారుతున్న ట్రెండ్
Kids In Earlier Age: గతంతో పోలిస్తే భారతీయ మహిళలు ఇప్పుడు చిన్న వయస్సులోనే పిల్లలకు జన్మనిస్తున్నారని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
Kids In Earlier Age: గతంతో పోలిస్తే భారతీయ మహిళలు చిన్న వయస్సులోనే తల్లులుగా మారుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 1992-93, 2019-21 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ఈ డేటాను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (National Family Health Survey) విశ్లేషించింది.
గతంలో 35 శాతమైతే ఇప్పుడు 64 శాతం
తాజా అధ్యయనం ప్రకారం.. 1992-93లో సర్వేలో పాల్గొన్న మహిళల్లో కేవల 35 శాతం మంది మాత్రమే 30 ఏళ్ల లోపు పిల్లలను కనడం పూర్తి చేశారు. 2019-21 వచ్చే సరికి అది కాస్తా 64 శాతానికి పెరిగింది. గతంలో ప్రతి వంద మంది మహిళల్లో 35 శాతం మంది తమకు 30 ఏళ్ల వయస్సు వచ్చేలోగా పిల్లలను కన్నారు. 2019-21 లో మాత్రం ప్రతి 100 మంది మహిళలం ఏకంగా 64 శాతం మంది మహిళలు తమకు 30 ఏళ్ల వయస్సు వచ్చే నాటికే పిల్లలను కనడం పూర్తి చేస్తున్నారు. గత సర్వేలతో పోలిస్తే 2019-21 లో 40 ఏళ్ల లోపు సంతానోత్పత్తిని ముగించిన మహిళల నిష్పత్తి చాలా కొద్ది మొత్తంలో మాత్రమే తక్కువగా నమోదు అయింది.
'సంతానోత్పత్తి చికిత్సలు అందుబాటులో ఉండటమే కారణం'
30 ఏళ్ల లోపు పిల్లలను కనే వారి సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినప్పటికీ.. 40 ఏళ్ల వరకు పిల్లలను కనే వారి సంఖ్య మాత్రం గతంతో పోలిస్తే కొద్దిగా మాత్రమే తక్కువగా ఉన్నట్లు సర్వే తేల్చింది. ఈ ధోరణికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అధ్యయన రచయిత చందర్ శేఖర్ వివరించారు. మహిళలు ఇప్పుడు తమ మొదటి సంతానానికి లేటు వయస్సులో జన్మనిస్తే.. తర్వాతి గర్భాలు, జననాలు ఎలాగూ ఆలస్యం అవుతాయి. మరో కారణం ఏమిటంటే.. ప్రస్తుతం సంతానోత్పత్తి చికిత్సలు సర్వసాధారణంగా మారాయి. కొందరు మహిళలకు ఈ చికిత్సలు సత్ఫలితాలు ఇవ్వడానికి సమయం పట్టవచ్చు. అలా ప్రసవాలు ఆలస్యం కావొచ్చు అని అధ్యయన రచయిత చందర్ శేఖర్ తెలిపారు.
మేఘాలయాలో సగటు వయస్సు 30 ఏళ్లకుపైనే
2004-05 లో నిర్వహించిన NFHS-III సర్వేలో ఆసక్తికర విషయం వెల్లడైంది. పిల్లలను కనడం పూర్తయిన మహిళల సగటు వయస్సు తమిళనాడులో 26 సంవత్సరాలు కాగా మేఘాలయలో 33 సంవత్సరాలు. ఆ తర్వాత జరిగిన రెండు సర్వేల్లో పిల్లలను కనడం పూర్తయిన మహిళల సగటు వయస్సు ఆంధ్రప్రదేశ్ లో 25 సంవత్సరాలు మాత్రమే కాగా.. మేఘాలయ లో మాత్రం 30 సంవత్సరాలుగా తేలింది.
ప్రసవాలపై ప్రభావం చూపిస్తున్న మహిళల నిరక్ష్యరాస్యత
15 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరిగి ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు జరగడం, ఎక్కువ కాలం గర్భం ధరించిన ఉండటం, 40 ఏళ్ల వరకు పిల్లలను కనడం అనేది ముస్లిం వర్గానికి చెందిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వే తేల్చింది. నిరక్షరాస్యత కూడా ఈ ధోరణిపై ప్రభావం చూపిస్తున్నట్లు సర్వే లో వెల్లడైంది. చదువుకోని మహిళలు వివాహం అయిన తర్వాత పిల్లలను కనడం, కనకపోవడంపై వారికి ఎలాంటి నియంత్రణా ఉండటం లేదని, పెళ్లైన వెంటనే పిల్లలను కనాలన్న ఒత్తిడి పెరుగుతున్నట్లు అధ్యయనం తేల్చింది. దీని వల్లే వయస్సు పెరుగుతున్నా పిల్లలను కంటూనే ఉంటున్నట్లు కూడా అధ్యయనం చెబుతోంది.