Indian Railways: జనరల్ బోగీలకు, స్లీపర్ క్లాస్‌లకు ఆధునిక హంగులు- ప్రక్షాళన దిశగా రైల్వే వ్యవస్థ
తూర్పు ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో సాధారణ కోచ్‌లు, నాన్-ఏసీ స్లీపర్ క్లాస్‌తో కూడిన సాధారణ రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది
దేశంలో కీలకంగా ఉన్న రైల్వేను ఆధునీకరించే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ ఇతర డిమాండ్ ఉన్న ప్రాంతాలలో సాధారణ కోచ్‌లు, నాన్-ఏసీ స్లీపర్ క్లాస్‌తో కూడిన సాధారణ్ రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. ఈ మేరకు డిమాండ్ ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద నగరాలను అనుసంధానం చేసేలా రైళ్లను నడుపనుంది. ఈ నేపథ్యంలో రైళ్లను అత్యాధుని వసతులతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ ట్రైన్‌లను కేంద్రం విజయవంతంగా నడుపుతోంది. రానున్న రెండేళ్లలో భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు చేయాలని చూస్తోందని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి.
అన్ని రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాట్లు చేయనున్నారు. ఆకస్మిక కుదుపుల నుంచి ప్రయాణికులను విముక్తి చేయడానికి యాంటీ-జెర్క్ కప్లర్‌లు, సెమీ-హై స్పీడ్ ట్రైన్‌సెట్‌లకు తక్కువ-ధర ప్రత్యామ్నాయంగా రైలును లాగడానికి రెండు ఇంజన్లు ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నారు. పుష్-పుల్ పద్ధతిలో నడిచే రైళ్లకు వెనుక, ముందు భాగంలో ఇంజన్లు ఉంటాయి. వీటి ద్వారా రైళ్లు త్వరగా వేగం అందుకోవడంతో పాటు అంతే త్వరగా రైళ్లను ఆపేందుకు వీలవుతోంది. ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికే వందే భారత్ రైళ్లలో ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే ఉపయోగిస్తున్న LHB కోచ్‌ల ట్రైన్ల సమయంతో పోలిస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ముంబై - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 2019 వరకు చాలా ఆలస్యంగా నడిచేది. అయితే దాని ప్రయాణ సమయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టారు. సెమీ హైస్పీడుతో రైలు ప్రయాణ వేగాన్ని పెంచారు. తక్కువ ధర, సెమీ-హై స్పీడ్ రైలు గంటకు 160 కి.మీల వేగంతో పరుగెత్తే సామర్థ్యం ఉన్నందున దీనిని విస్తరించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో ఇటువంటి వేగాన్ని కలిగి ఉండే WAP-5, WAP-7 తరగతుల ఇంజిన్‌లలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అక్టోబర్ నాటికి ఒక రేక్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఖర్చుల నియంత్రణ, మెయింటెనెన్స్ తగ్గించుకునే క్రమంలో రైళ్ల ఆధునీకరణకు బీజం వేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా అధునీకరించే రైళ్లను తొలుత తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఇతర అదనపు డిమాండ్‌ను ఉన్న మార్గాల్లో నడుపుతారు.
వందేభారత్ ప్రత్యేకతలు తెలుసా?
వందేభారత్ రైలును వెలుపల రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందించారు. గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. ప్రత్యేకంగా లోకోమోటివ్‌ను జత చేసే అవసరం ఉండదు. ఎంఎంటీఎస్ రైలు తరహాలో లోకోపైలట్ కేబిన్‌లు ట్రైన్‌కు వెనుకా ముందు ఉంటాయి. సీట్లు 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. అందులో ప్రయాణికులకు రైలు వేగంతో సహా అన్ని వివరాలు కనిస్తాయి. ఆటోమేటిక్ తలుపులుంటాయి. వాటి నియంత్రణ లోకోపైలట్ వద్దే ఉంటుంది. మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు. రైలు ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచుకుంటాయి. బయలుదేరటానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి. రైలులో సీసీటీవీ కెమెరాలుంటాయి. లోపల వైఫై వసతులు ఉంటాయి. విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు వెలిగేలా ప్రతి కోచ్‌లో నాలుగు ఎమర్జెన్సీ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రైన్లు కేవలం పగటి పూట మాత్రమే ప్రయాణిస్తాయి.