World No Tobacco Day: ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న పొగాకు వాడకం, ఎందుకో తెలుసా?
World No Tobacco Day: ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకం గణనీయంగా తగ్గుతోంది. దాని వెనక పలు కారణాలు ఉన్నాయి.
World No Tobacco Day: 'నా పేరు ముఖేష్..' గతంలో ప్రతి సినిమా మొదట్లో ఈ యాడ్ వచ్చేది. అలా ముఖేష్ యాడ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఈ ప్రభుత్వ యాడ్ జనాలపై విపరీతమైన ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు. పొగాకు, గుట్కా, జర్దా కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ యాడ్ వల్ల చాలా మంది పొగాకు మానేశారంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాది మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం జరుపుకుంటాం. పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, అనర్థాల గురించి ఈ రోజు అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా భారత్ తో పాటు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకం గురించి కొన్ని ఆసకక్తికర విషయాలు తెలుసుకుందాం.
తగ్గుతున్న పొగాకు వాడకం
పొగాకు వినియోగించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది. చాలా మంది పొగాకు మానేస్తున్నట్లు కొన్నేళ్లుగా వెలువడుతున్న గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ప్రపంచంలోని అనేక దేశాల్లో, పొగాకు వినియోగించే వారి సంఖ్య నిరంతరం తగ్గుతోంది. చాలా దేశాల్లో ఈ తగ్గుదల చాలా వేగంగా ఉంది. ఏయే దేశాల్లో పొగాకు వాడకం తగ్గుతోంది, పొగాకు వినియోగం ఇంతలా తగ్గడానికి అసలు కారణాలేంటి, ప్రభుత్వ చర్యల వల్లే ఇంతటి తగ్గుదల కనిపిస్తోందా అనే ప్రశ్నలకు సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం.
పొగాకు వాడకం ఎంత తగ్గుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, చాలా దేశాల్లో పొగాకు వినియోగం తగ్గుతోంది. WHO ప్రకారం ప్రపంచంలో 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పొగాకు వాడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఎక్కడెక్కడ ఈ తగ్గుదల నమోదు అవుతుందో ఇప్పుడు చూద్దాం.
- పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, పొగాకు ఉపయోగించే పురుషుల వాటా 2000వ సంవత్సరంలో 50.8గా ఉంది. 2025 నాటికి అది కాస్త 45.7 శాతానికి తగ్గుతుందని అంచనా. అదే సమయంలో ఇందులో మహిళలు 5 నుండి 2.5 కి పడిపోతుందని అంచనా.
- ఆగ్నేయ ప్రాంతంలో పొగాకు వినియోగించే పురుషుల వాటా 2000 సంవత్సరంలో 68.2 గా ఉంది. 2025 నాటికి ఇది 42.7 గా ఉంటుందని అంచనా. అదే సమయంలో మహిళల్లో ఈ శాతం 32.5 నుండి 8.6 శాతానికి తగ్గుతుందని అంచనా.
- యూరోపియన్ ప్రాంతంలో 2000 సంవత్సరంలో పొగాకు ఉపయోగించే పురుషుల వాటా 46.5 గా ఉండేది. అది కాస్త 2025 నాటికి 30.4 శాతానికి తగ్గుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. 22.6 శాతంగా ఉన్న మహిళలు 17 శాతానికి తగ్గుతుందని అంచనా.
- యూఎస్ లో పొగాకు వినియోగించే పురుషుల వాట 2000 సంవత్సరంలో 35.5 శాతంగా ఉంది. 2025 నాటికి 18.9 శాతంగా ఉంటుందని అంచనా. మహిళలు 20.6 శాతం నుండి 9.8 శాతానికి తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయి.
- ఆఫ్రికాలో పొగాకు తీసుకునే పురుషుల వాటా 2000 సంవత్సరంలో 28.7 శాతం. అది కాస్త 2025 నాటికి 16 శాతంగా ఉంటుందని అంచనా. మహిళలు 7.1 శాతం నుండి 2.2 శాతానికి పరిమితం అవుతారని చెబుతున్నారు.
- భారత్ లో పొగాకు వినియోగం గణనీయంగా తగ్గుతోంది. గ్లోబల్ అడల్స్ టొబాకో సర్వే (2009-2010) నుండి 2017 సర్వేలో 4.5 శాతం క్షీణత ఉన్నట్లు తేల్చింది.
పొగాకు వినియోగం తగ్గడానికి కారణాలు
పొగాకు వాడకం గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం. ప్రతి ఒక్కరిలో అవగాహన రావడం. ప్రభుత్వాలు పొగాకు వినియోగంపై చేస్తున్న అవగాహన, ప్రచార కార్యక్రమాలు మంచి ఫలితాన్ని తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా, తదనంతరం ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా పొగాకు వాడకం తగ్గడానికి కారణమని నివేదికలు చెబుతున్నాయి.