Madhya Pradesh High Court: భార్యభర్తల శృంగారంపై హైకోర్టు సంచలన తీర్పు, అలా అయితే విడాకులు తీసుకోవచ్చు
Physical Relationship: భర్తతో లైంగిక సంబంధం పెట్టుకోవడం లేదా శృంగారానికి భార్య నిరాకరించడం మానసిక క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Wife And Husband Physical Relationship: భార్యాభర్తల విడాకుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) సంచలన తీర్పును ఇచ్చింది. భర్తతో లైంగిక సంబంధం పెట్టుకోవడం లేదా శృంగారానికి భార్య నిరాకరించడం మానసిక క్రూరత్వమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆమె నుంచి భర్త విడాకులు కోరుకునే హక్కు ఉందని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఈ కారణం సరైనదేనని.. ఇది చట్టబద్ధమైన విడాకుల దావాకు దారితీస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
భోపాల్‌కు చెందిన సుదీప్తో సాహా, మౌమితా సాహాకు జులై 12, 2006న వివాహం జరిగింది. అప్పటి నుంచి 2006 జూలై 28 వరకు 16 రోజుల పాటు సుదీప్తో సాహోకు మౌమితా సాహో దూరంగా ఉంది. దీంతో విసిగిపోయిన సదరు భర్త సుదీప్తో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. పేరుకేమో పెళ్లైందని.. కానీ తాను భారతదేశం విడిచి వెళ్లే వరకు భార్య తనను ముట్టనివ్వలేదని.. ఈ కారణం చేత తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే అతని వాదనను ఫ్యామిలీ కోర్టు అంగీకరించలేదు. విడాకులు మంజూరు చేయడానికి ఇది సరైన కారణం కాదని చూపుతూ 2014 నవంబర్‌లో పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.
పెళ్లి జరిగినప్పటి నుంచి తన భార్య దూరంగా ఉంటోందని, కుటుంబ సభ్యుల బలవంతం మీద తనను పెళ్లి చేసుకున్నట్లు చెబుతోందని కోర్టుకు వివరించాడు. అంతే కాదు తన భార్యకు పెళ్లికి ముందే ప్రియుడు ఉన్నాడని, ఈ కారణంగా శృంగారానికి నిరాకరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. పెళ్లి తరువాత మౌమిత తనను ప్రియుడి వద్దకు పంపించేయాలని అడిగిందని, 2006 సెప్టెంబర్‌లో వివాహ బంధాన్ని కాదని ఇంటి నుంచి వెళ్లిపోయిందని వివరించాడు.
అంతేకాకుండా 2013లో తనపై, తన తల్లిదండ్రలపై మౌమిత తప్పుడు కేసు పెట్టిందని, వరకట్నం కోసం వేధించారంటూ ఆరోపించందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. చీరతో తన గొంతు కోసేందుకు ప్రయత్నించారని, నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని మౌమిత ఆరోపించడంతో తన తల్లిదండ్రులు దాదాపు 23 రోజులపాటు కస్టడీలో ఉన్నారని సుదీప్తో కేర్టుకు వివరించారు. ఈ విషయాన్ని సెటిల్‌మ్ంట్ చేసుకోవడానికి మౌనిత రూ. 10 లక్షలు డిమాండ్ చేసిందని, ఆ తర్వాత విడాకుల పిటిషన్‌పై సంతకం చేసిందని వెల్లడించారు. అయితే, ఆమె సంతకం చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు.
దీన్ని విచారణకు స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సరైన కారణం లేకుండా భార్య తన భర్తతో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వానికి సమానమని తెలిపింది. ఇది సరైన కారణం కాదని గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు తప్పని వ్యాఖ్యానించింది. పెళ్లి తరువాత భర్త భారతదేశాన్ని విడిచిపెడతాడని తెలిసి కూడా మహిళ శృంగారానికి నిరాకరంచడం భర్తను మానసిక వేదనకు గురిచేయడమేనని పేర్కొంది.
ఎటువంటి శారీరక అసమర్థత లేదా సరైన కారణం లేకుండా ఎక్కువ కాలం పాటు లైంగిక సంపర్కం చేయడానికి ఏకపక్షంగా నిరాకరించడం మానసిక క్రూరత్వానికి దారితీస్తుందని షీల్ నాగు, వినయ్ సరాఫ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది.