Madras High Court :భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంది- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Madras High Court : భరణం కోరే ప్రతి భార్య తన భర్త జీతభత్యాలు తెలుసుకునే హక్కు ఉందని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది.
Madras High Court :వైవాహిక వివాదాల విషయంలో భరణం కోరే టైంలో తన భర్త జీతం వివరాలను తెలుసుకునే హక్కు భార్యకు ఉందని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ వ్యక్తి జీతం వివరాలు భార్యకు చెప్పాలని స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ఆయన పిటిషన్ కొట్టేసింది. ఎస్‌ఐసీ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.
పిటిషనర్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి. దీని కారణంగా భార్యభర్త విడిపోవడానికి సిద్దపడ్డారు. ఈ టైంలో భర్త జీతభత్యాలపై భార్య ఆరా తీయడం మొదలు పెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఆయన పూర్తి వివరాలు కావాలని అభ్యర్థన పెట్టుకుంది.
ఆయన అభ్యంతరం చెప్పడంతో జీతభత్యాల వివరాలు ఇచ్చేందుకు పని చేస్తున్న సంస్థ సమ్మతించలేదు. భార్య అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆమె రాష్ట్ర సమాచార కమిషన్‌కు వెళ్లారు. అక్కడ కేసును పరిశీలించిన తర్వాత భర్త వివరాలు ఇవ్వాలని ఆ సంస్థకు ఆదేశించారు.
ఎస్‌ఐసీ ఇచ్చిన ఉత్తర్వులపై 2020లోఆ వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇన్నేళ్లు కేసును విచారించిన న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఎస్‌ఐసీ ఉత్తర్వులు రద్దు చేసేందుకు నిరాకరించింది. భార్య తరుపున వాదనలతో ఏకీభవించింది.
పిటిషనర్‌ల మధ్య వివాహ వ్యవహారాలు పెండింగ్‌లో ఉన్నందున అతని భార్యకు చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని పిటిషనర్ ఆదాయం నిర్ణయిస్తుందని జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో తన భార్య థర్డ్ పార్టీ అని భర్త చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తన భర్త జీతం గురించి వివరాలు తెలియకపోతే ఆ మహిళ సరైన విధంగా క్లెయిమ్ చేయలేరని అన్నారు.
భర్త జీతం గురించి తెలుసుకునే హక్కు భార్యకు ఉందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ స్వామినాథన్ ఉదహరించారు. భర్త అభ్యర్థనను తిరస్కరించారు. తద్వారా SIC ఆర్డర్‌ను సమర్థించారు.