Bhagat Singh: భగత్ సింగ్ టోపీ రహస్యం: విప్లవానికి చిహ్నంగా మారిన ఫోటో వెనుక అసలు కథేంటి?
Bhagat Singh: భగత్ సింగ్ భారత స్వాతంత్య్ర చరిత్రలో మండే అగ్నికణం. ఆయన జీవితం, చేసిన త్యాగం, ప్రవచించిన సిద్ధాంతాలు నేటి తరానికి కూడా పిడికిలి బిగించేలా చేస్తాయి.

Bhagat Singh: భగత్ సింగ్ భారత స్వాతంత్య్ర చరిత్రలో మండే అగ్నికణం. ఆయన జీవితం, చేసిన త్యాగం, ప్రవచించిన సిద్ధాంతాలు నేటి తరానికి కూడా పిడికిలి బిగించేలా చేస్తాయి. సమాజం కోసం ఆలోచించేలా తీర్చిదిద్దుతాయి. భగత్ సింగ్ అనగానే మనకు టోపీ పెట్టుకున్న నవ యువకుడి ఫోటో కళ్ల ముందు కనిపిస్తుంది. అయితే ఆ టోపీతో ఉన్న ఫోటో కేవలం ఫోటో కాదు, అది విప్లవానికి చిహ్నం, భగత్ సింగ్ త్యాగానికి రూపం. ఆ టోపీ ఫోటో వెనుక ఉన్న చారిత్రక విప్లవ కథ ఏంటో తెలుసుకుందాం.
భగత్ సింగ్ దిగిన ఫోటోలు ఇవే...
ప్రతి ఫోటోకు ఒక జ్ఞాపకం ఉంటుంది. అందరూ ఫోటోలు దిగుతారు, కానీ కొందరి ఫోటోలు మాట్లాడతాయి, స్ఫూర్తిని కలుగజేస్తాయి. అలాంటి ఫోటోలలో భగత్ సింగ్ దిగిన ఫోటోలు ముఖ్యమైనవి. ఆయన దిగిన చిత్రాల్లో మనకు అధికారికంగా అందుబాటులో ఉన్నవి కేవలం నాలుగు మాత్రమే.
1. భగత్ సింగ్ బాలుడిగా ఉన్నప్పుడు దిగిన ఫోటో.
2. విద్యార్థిగా ఉన్నప్పుడు ఫోటో, ఇది ఆయన కాలేజీ రోజుల్లో తీసిన ఫోటో.
3. టోపీతో ఉన్న ఫోటో, ఇది భగత్ సింగ్ ఒక విప్లవ వీరుడిలా మారిన తర్వాత బాగా ప్రాచుర్యం పొందిన ఫోటో.
4. జైలులో ఉన్నప్పుడు ఫోటో, ఇది భగత్ సింగ్‌ను అరెస్ట్ తర్వాత జైలులో తీసిన ఫోటో.
భగత్ సింగ్ ప్రసిద్ధ టోపీ ఫోటో ఎక్కడ, ఎప్పుడు తీశారు?
టోపీలో ఒక దొరబాబులా ఠీవిగా, అందంగా కనిపించే భగత్ సింగ్ ఫోటో దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా మనకు కనిపిస్తుంది. అంతటి ప్రాచుర్యం పొందిన టోపీ ఫోటోను ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న "రామ్‌నాథ్ స్టూడియో"లో 1929లో తీశారు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరే ముందు, అంటే 1929, ఏప్రిల్ 8వ తేదీకి కొన్ని రోజుల ముందు ఈ ఫోటో తీసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఫోటో తీసే సమయంలో భగత్ సింగ్ తన సహచరుడు అయిన బటుకేశ్వర్ దత్‌తో కలిసి ఉన్నారు.
విప్లవ వ్యూహంలో భాగంగానే టోపీ ఫోటో
టోపీతో భగత్ సింగ్ ఫోటో సరదాగా దిగిందేమీ కాదు, అది ఒక వ్యూహంతో దిగిన ఫోటో. ఆనాడు సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్‌ను పట్టుకోవడానికి నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో పోలీసులు తనను గుర్తించకుండా ఉండేందుకు భగత్ సింగ్ ఈ వేషం ధరించాల్సి వచ్చింది. అందుకోసం తన సిక్కు మత విశ్వాసాలను పక్కనపెట్టి గడ్డం తొలగించారు, తల జుట్టు కత్తిరించుకున్నారు. ఇలా చేసిన తర్వాత ఆయన తన కొత్త రూపంతో టోపీ ధరించి, స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవ పంథాను ప్రచారం చేయాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఫోటోకు మరో ప్రధాన కారణం ఒకవేళ తాను అరెస్ట్ అయితే వార్తా పత్రికల్లో తన కొత్త రూపంతో కూడిన ఫోటోనే ప్రచురితం కావాలని, తన పోరాటాన్ని ప్రజలకు తెలియజెప్పేలా ఈ ఫోటో సాధనంగా వాడబడాలని భగత్ సింగ్ ఆకాంక్షించినట్లు చెబుతారు. అసెంబ్లీలో బాంబు విసిరి తమ విప్లవ ఆకాంక్షలను ప్రపంచానికి చాటాలని భగత్ వ్యూహాత్మకంగా ఈ టోపీ ఫోటో దిగినట్లు చరిత్ర చెబుతోంది.
భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు ఎందుకు వేశారంటే?
1929లో బ్రిటిష్ ప్రభుత్వం రెండు నిరంకుశ బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి పబ్లిక్ సేఫ్టీ బిల్లు, రెండోది ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు. అయితే ఈ బిల్లులు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, దేశంలో ఎవరూ నిరసనలు చేయకుండా అణగదొక్కేలా బిల్లులు ఉన్నాయన్నది భగత్ సింగ్ ఉద్దేశం. ఇందుకు ప్రతీకారంగా తమ నిరసన తెలియజేయాలన్నది భగత్ సింగ్ వ్యూహం. అందుకు ఆయన తన సహచరుడు బటుకేశ్వర్ దత్‌తో పాటు ఏప్రిల్ 8, 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఇప్పటి పార్లమెంట్ పాత భవనంలో బాంబులు విసరాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లుపై చర్చ జరుగుతుంది. అసెంబ్లీ గ్యాలరీకి చేరుకున్న భగత్ సింగ్, దత్ లు గ్యాలరీ నుంచి రెండు బాంబులను అసెంబ్లీలోకి విసిరారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తక్కువ నష్టం చేసే బాంబులు విసిరారు. అయితే ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఆ శబ్దం విని సభ్యులు పరుగున తీశారు. అదే సమయంలో 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ కరపత్రాలను సభలో విసిరివేసి నినాదాలు చేస్తూ భగత్ సింగ్, అతని మిత్రుడు బటుకేశ్వర్ దత్ అక్కడే గ్యాలరీలో అరెస్టు అయ్యేందుకు నిశ్చయించుకుని ఉండిపోయారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత భగత్ సింగ్‌కు ఉరిశిక్ష అమలు అయిన విషయం తెలిసిందే.
టోపీ ఫోటో ఎలా బయటకు వచ్చిందంటే?
అసెంబ్లీలో బాంబు దాడికి ముందు ఈ ఫోటోను ఫోటోగ్రాఫర్ రామ్ నాథ్ తీశారు. ఈ ఫోటోగ్రాఫర్ పోలీసులకు కూడా ఫోటోలు తీసేవాడు. అయితే భగత్ సింగ్ ఉద్దేశం తెలిసిన రామ్ నాథ్ భగత్ సింగ్ సహచరుడు జైదేవ్ కపూర్‌కు నెగిటివ్‌లను, ఫోటో ప్రింట్‌లను ఇచ్చారని దీనిపై పరిశోధన చేసిన వారు చెబుతారు. ఈ ఫోటో, నెగిటివ్‌లు లాహోర్‌కు తీసుకెళ్లారని, అక్కడ అనేక కాపీలు తీయించి హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కార్యకలాపాల కోసం, ప్రచార పత్రాల కోసం ఉపయోగించినట్లు చెబుతారు. భగత్ సింగ్ అరెస్ట్ తర్వాత ఈ ఫోటోలు ఆయా వార్తా పత్రికల ద్వారా ప్రచురితమై దేశవ్యాప్తంగా టోపీ ఫోటో ఒక విప్లవ చిహ్నంగా మారింది.






















