Jagannath Rath Yatra Stampede: జగన్నాథ రథయాత్రలో అపశృతి- దూసుకొచ్చిన ఏనుగులు, తొక్కిసలాటలో నలుగురు భక్తులకు గాయాలు
Stampede at Jagannath Rath Yatra | అహ్మదాబాద్ జగన్నాథ యాత్రలో ఏనుగు అదుపు తప్పడంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

Ahmedabad stampede in Jagannath Rath Yatra: నేడు దేశ వ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 148వ జగన్నాథ రథయాత్ర వేడుకలు మొదలయ్యాయి. కానీ జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. డ్రమ్స్, వాయిద్యాల శబ్దానికి భయపడి ఓ ఏనుగు అటూ ఇటూ పరుగులు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో భక్తులు పరుగులు తీయగా తొక్కిలసలాటకు దారి తీసింది. అయితే, చివరకు మావటి ఆ బయపడిన ఏనుగును అదుపులోకి తేవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అహ్మదాబాద్‌లో జరుగుతున్న జగన్నాథుడి యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సమయంలో పెద్ద శబ్ధాలకు మూడు ఏనుగులు అదుపు తప్పాయి. అందులో ఓ ఏనుగు భక్తుల మీదకు దూసుకురావడంతో భయాందోళనతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఏనుగులను చూసిన వెంటనే ప్రజలు అప్రమత్తమై వాటికి దారి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయం ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు గాయపడ్డారని సమాచారం.
Watch | Three elephants in Ahmedabad Rath Yatra procession went out of control and started running in the Khadia area of the city. pic.twitter.com/iqNGRjROVo
— DeshGujarat (@DeshGujarat) June 27, 2025
ఏనుగులు అదుపు తప్పాయి
అహ్మదాబాద్ రథయాత్ర మార్గంలో ఖాడియా ప్రాంతం ఉంది. ఏనుగులు అదుపు తప్పిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. డీజే శబ్దానికి ఒక ఏనుగు భయపడి పరిగెత్తడం ప్రారంభించింది. ఆ ఏనుగును చూసి మిగిలిన రెండు ఏనుగులు పరుగులు తీశాయి. యాత్రలో మరికొన్ని ఏనుగులు ఉన్నాయని, అవి సక్రమంగానే ఉన్నాయని సమాచారం. మొత్తం ఏనుగుల్లో మూడు ఏనుగులు ఖాడియా వీధుల్లో పరిగెత్తడంతో భక్తుల మధ్య తొక్కిసలాటకు దారితీసిందని తెలిపారు.
కొందరు భక్తులకు గాయాలు
ఖాడియా వీధుల్లో ఏనుగులు అదుపుతప్పడం, దాంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగిన ఘటనలో ముగ్గురు నుంచి నలుగురు భక్తులు గాయపడినట్లు సమాచారం. వారిలో ఒకరు మీడియా ప్రతినిధి ఉండగా, మిగతా వారు భక్తులు. అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని... ఏనుగులు భక్తుల దగ్గరకు వచ్చేలోపు వారిని రక్షించారు.
జగన్నాథ యాత్రలో ముందుగా గజరాజులు నడుస్తాయి. వారితో పాటు మావటి, అటవీ శాఖ అధికారులు ఉంటారు. అయితే భారీ శబ్దాలతో ఏనుగులు అదుపు తప్పి అటూ ఇటూ పరుగులు తీశాయి. వెంటనే అటవీ శాఖ అధికారులు, మావటి అప్రమత్తమయ్యారు. బృందం వద్ద ట్రాంక్విలైజర్‌తో పాటు ఇతర కంట్రోల్ చేసే పరికరాలు ఉన్నాయి. వారు వెంటనే ఏనుగులను అదుపులోకి తేవడంతో దాదాపు 15 నిమిషాల పాటు రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర..
ఉదయం 6 గంటలకే హారతి కార్యక్రమంతో రథయాత్రకు సంబంధించిన పూజలు మొదలవుతాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు "చెహరా పహారా" ఆచారం పాటిస్తారు. రథయాత్రలో ముఖ్యమైన ఆచారం ఇది. చెహరా పహారా అంటే స్థానిక భాషలో ఊడ్చటం అని అర్థం. జగన్నాథుడితో పాటు, బలభద్రస్వామి, సుభద్ర రథాల ముందు పూరీ రాజు బంగారుచీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులు ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొంటారు.






















