Vice President Election : ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎంత కాలంలో ఎన్నిక జరపాలి? ప్రక్రియ, అర్హతలు, సుప్రీంకోర్టు పాత్ర తెలుసుకోండి!
Vice President Election : ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాజ్యాంగం ఎటువంటి కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించలేదు. కానీ, "వీలైనంత త్వరగా" ఎన్నిక జరపాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది.

Vice President Election : భారత రాష్ట్రపతి తర్వాత దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావిస్తుంది. రాష్ట్రపతి లేని సమయాల్లో ఉపరాష్ట్రపతే దేశానికి నాయకత్వం వహిస్తారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం వంటి రెండు ప్రధాన విధులను ఉపరాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించింది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు కాలపరిమితి ఎంత?
రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి ఆరు నెలలు మాత్రమే ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆ ఆరు నెలల్లోపు కొత్త రాష్ట్రపతి ఎన్నిక కావాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అయితే, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాజ్యాంగం ఎటువంటి కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించలేదు. కానీ, "వీలైనంత త్వరగా" ఎన్నిక జరపాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను రూపొందించే అధికారం భారత ఎన్నికల సంఘానిదే. నామినేషన్లు దాఖలు చేయడం, వాటి పరిశీలన, అభ్యర్థుల ఉపసంహరణ తేదీ, పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది.
ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే...?
ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు పద్ధతిలో జరుగుతుంది. అంటే, ఓటుకు నిర్దిష్ట విలువ ఉంటుంది. అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేస్తారు. 1974 ఎన్నికల నిర్వహణ నియమాల ప్రకారం ఈ ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదకులుగా ఉండాలి, మరో 20 మంది ఎంపీలు ఆ ప్రతిపాదనలను సమర్థించాలి. వీరందరూ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులై ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే పత్రంతోపాటు, ఎన్నికల నియమావళి ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల రాజ్యాంగపరమైన, చట్టపరమైన అర్హతలను ధృవీకరిస్తారు. ఒకవేళ నామినేషన్ తిరస్కరిస్తే, కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఉపసంహరణ తేదీలోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
పోలింగ్ న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లోనే ఎన్నికల అధికారుల సమక్షంలో జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులు అందరూ (ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులు) ఓటర్లు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కరే బరిలో ఉంటే, ఆ అభ్యర్థే ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ పద్ధతిలో జరుగుతుంది. ఒక అభ్యర్థి ఎన్నికయ్యేందుకు అవసరమైన ఓట్ల కోటాను పొందితే, ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే, అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులను తొలగిస్తూ, వారి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తూ ఫలితం వచ్చే వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
ఎన్నికను రద్దు చేసే అధికారం ఎవరిది?
పోలింగ్ తర్వాత లెక్కింపు పూర్తయితే, రిటర్నింగ్ అధికారి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఎవరు విజేతగా నిలిచారో ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం ఈ విషయాన్ని పేర్కొంటూ అధికారిక గెజిట్‌లో ఫలితాన్ని ప్రచురిస్తుంది. ఈ ఎన్నికపైన ఏదైనా వివాదం తలెత్తితే, దానిని పరిష్కరించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. దీనిపై ఇతర ఏ కోర్టులకూ అధికారం ఉండదు. ఎన్నికల చట్టాల ఉల్లంఘన, అవినీతి ఆరోపణలు, నామినేషన్ల తిరస్కరణ, ఎన్నిక రద్దు వంటి అధికారాలన్నీ సుప్రీంకోర్టుకు రాజ్యాంగం ఇచ్చింది. ఎన్నికైన అభ్యర్థి ఎన్నిక తీరు సరిగా లేదని రుజువైతే, సుప్రీంకోర్టు ఎన్నికను రద్దు చేయవచ్చు. అయితే, సాధారణంగా సుప్రీంకోర్టు కొత్త అభ్యర్థిని ప్రకటించదు; అటువంటి సందర్భాలలో, మళ్లీ ఎన్నికలు జరుగుతాయి.




















