Who Was VD Savarkar: వీరుడా లేక క్షమాపణ చెప్పేశాడా.. ఎవరీ సావర్కర్ ? మహాత్మా గాంధీ కంటే ముందుగానే ఉద్యమాన్ని మొదలుపెట్టారన్న విక్రమ్ సంపత్
Who Was Vinayak Damodar Savarkar | గాంధీ కంటే ముందుగానే వీర్ సావర్కర్ విదేశీ వస్తువుల బహిష్కరణ ప్రారంభించారని ఇండియా 2047 సదస్సులో పాల్గొన్న చరిత్రకారుడు విక్రమ్ సాంపత్ పేర్కొన్నారు.

Veer Savarkar | న్యూఢిల్లీ: వీడీ సావర్కర్‌ను వీర్ సావర్కర్ అని కొందరు పిలుస్తుండగా.. మరో వర్గం ఆయన బ్రిటీషర్లకు క్షమాపణ చెప్పాడని వాదిస్తుంటుంది. ఈ విషయంపై ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా@2047 కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ్ సంపత్ ఎందరికో తెలియని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
మొదటి రహస్య సంస్థను ప్రారంభించారు..
వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) ప్రముఖ రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. అయితే ఆయన బ్రిటీషర్లకు క్షమాపణ చెప్పారని ఓ వర్గం ఆరోపిస్తుండగా.. ఆయనను వీర్ సావర్కర్ అని మరో వర్గం పిలుస్తోంది. ఏబీపీ నెట్‌వర్క్ యొక్క ఇండియా@2047 సదస్సులో విక్రమ్ సంపత్ మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ సమయంలో మొదటి రహస్య సంస్థను ప్రారంభించింది సావర్కరే అని తెలిపారు.
గాంధీ కాదు సావర్కరే ఆ పని ముందుగా చేశారు
స్వదేశీ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ, విదేశీ ఉత్పత్తుల బహిష్కరణలో భాగంగా దేశంలో మొట్ట మొదటగా విదేశీ వస్తువులు బహిష్కరించింది వీర్ సావర్కర్ అని సంచలన విషయాలు తెలిపారు. చాలా మంది దేశంలో మొదటగా విదేశీ వస్తు బహిష్కరణ చేసింది మహాత్మా గాంధీ అనే ప్రజాభిప్రాయానికి భిన్నంగా విక్రమ్ సంపత్ ఈ విషయాన్ని తెలిపారు. 1905లో పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో విదేశీ దుస్తులను మొదటగా కాల్చివేసిన వ్యక్తి వీడీ సావర్కర్ అని స్పష్టం చేశారు.
‘వినాయక్ దామోదర్ సావర్కర్ భారతదేశంలోని తొలి రహస్య సంస్థ అయిన అభినవ భారత్‌ను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఇటలీకి చెందిన గార్‌బాల్డి, మజినీ నుంచి స్ఫూర్తి పొంది ఆ సంస్థను సావర్కర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఏబీపీ నెట్‌వర్క్ ప్రతినిధి చిత్ర త్రిపాఠి "సావర్కర్ ఎవరు" అని అడిగిన ప్రశ్నకు విక్రమ్ సంపత్ ఈ విషయాలు తెలిపారు.
"లండన్‌లో చదువుకునే రోజుల్లో, భారతదేశ స్వాతంత్ర్యం కోసం శ్యామ్జీ కృష్ణ వర్మ, మేడమ్ భీకజీ కామా అనే వారితో కలిసి విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించాడు సావర్కర్" అని విక్రమ్ సంపత్ పేర్కొన్నారు.
#ABPIndiaAt2047 | In discussion with Dr. Vikram Sampath (FRHistS), Author and Historian, who deliberates on "Reimagining India: Letters to the Future"
— ABP LIVE (@abplive) May 6, 2025
WATCH LIVE - https://t.co/qdAP8P62fE
READ LIVE - https://t.co/a9G7Piqk71 pic.twitter.com/EBC593YadD
భారత్, పాక్ మధ్య ఎందుకీ వివాదం..
గతంలో జరిగిన ఏ తప్పుల వల్ల పాకిస్తాన్‌తో భారతదేశానికి ఈ పరిస్థితి తలెత్తిందన్న విషయంపై చరిత్రకారుడు విక్రమ్ సంపత్ స్పందించారు. "మనం ఒకే ఒక నిజం ఉందని, దాన్ని చేరుకోవడానికి భిన్నమైన మార్గాలు ఉంటాయి. ప్రతి మార్గమూ న్యాయబద్ధమైనవిగా ఉండాలని నేర్పించే నాగరికత నుండి వచ్చాం. చర్చల ద్వారా అవతలివారిని మన మార్గంలోకి తీసుకురావచ్చు. కానీ వారి విశ్వాసాలు, అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి ఆలోచనలను నమ్మని వారిని అవిశ్వాసులు, లేక కాఫిర్లుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.
అది మధ్యయుగంలో తలెత్తిన ఆలోచన కాదని, 1990లలో అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు బుద్ధ విగ్రహాలు ధ్వంసం చేశారని ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీగా ఉన్న హిందువుల జనాభా తగ్గుతుందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.






















