రైలు పట్టాలకు పగుళ్లు, సమయస్ఫూర్తి ప్రదర్శించిన రైతు! తప్పిన పెను ప్రమాదం
ఓ రైతు తన తెలివితేటలతో కొన్ని వేల ప్రాణాలను కాపాడగలిగాడు. రైల్వే ట్రాక్ పై పగుళ్లను గుర్తించిన ఓ రైతు తన మెడలో ఉన్న ఎర్రని కండువాను ఊపి రైలును ఆపాడు.ఎర్రని వస్త్రాన్ని గుర్తించిన లోకోపైలట్ రైలును
ఓ రైతు తన తెలివితేటలతో కొన్ని వేల ప్రాణాలను కాపాడగలిగాడు. రైల్వే ట్రాక్ పై పగుళ్లను గుర్తించిన ఓ రైతు తన మెడలో ఉన్న ఎర్రని కండువాను ఊపి రైలును ఆపాడు. ఎర్రని వస్త్రాన్ని గుర్తించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో గోమతి ఎక్స్ ప్రెస్ కు ఈ ప్రమాదం తప్పింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ నుంచి లఖ్‌నవూకు బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం తప్పింది.
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని భోలా కా పూర్వ గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే రైతు తన పొలం వైపు వెళ్లడానికి రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఓ చోట పట్టాల వెంట పగులు కనిపించింది. ఆ సమయంలో పట్టాల వెంట వస్తున్న రైలును గమనించాడు. వెంటనే అప్రమత్తమై తన మెడలో ఉన్న ఎర్రని వస్త్రాన్ని చూపుతూ రైలుని ఆపాలని గట్టిగా కేకలు పెట్టడంతో పాటు..రకరకాల సంకేతాలిచ్చాడు.
రైతు సంకేతాలను అర్థం చేసుకున్న లోకో పైలట్ రైలు స్పీడును నెమ్మదిగా తగ్గించి నిదానంగా ఆపాడు. కిందకి దిగిన లోకోపైలట్ కు పట్టాల పగుళ్లను చూపించాడు. ముందు ఆశ్చర్యపోయిన లోకోపైలట్ రైతు తెలివి తేటలను మెచ్చుకున్నాడు. పెద్ద ప్రమాదం నుంచి కొన్ని వేల మందిని కాపాడినందుకు భన్వర్ సింగ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పట్టాలు పగుళ్లు ఏర్పడడంతో కాసేపు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలకు మరమ్మతులు పూర్తైన తరువాత అనంతరం రైళ్ల రాకపోకలు సాగాయి.