Puja Khedkar: పూజా ఖేద్కర్ కు షాక్! సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
IAS Puja Khedkar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఆమె భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది.
Puja Khedkar:వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఇది కాకుండా, ఆమె భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది. జూలై 19న పూజా ఖేద్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం , నాన్ క్రీమీలేయర్ కోటాలను దుర్వినియోగం చేసినందుకు ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది.
ప్రకటించిన యూపీఎస్సీ
పూజా ఖేద్కర్ నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగం పొందారని ఆరోపణలు వచ్చాయి. పూజా ఖేద్కర్ 2022 నాటి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ గా నియమితులయ్యారు. తన తొలి పోస్టింగ్‌లోనే విచిత్రమైన డిమాండ్లు చేయడం ప్రారంభించారు. దీనిపై వివాదం ముదరడంతో పూణె నుంచి వాసీమ్ కు బదిలీ అయ్యారు. ఇదొక్కటే కాదు, నాన్ క్రీమీలేయర్ ఓబీసీ రిజర్వేషన్ పొందేందుకు తప్పుడు పత్రాలు ఇచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆమెపై చర్యలు తీసుకుంటామని యూపీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022కి పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులో అడిగారు. పూజా ఖేద్కర్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి జూలై 25 వరకు సమయం ఇచ్చింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కోరింది. ఈ సమయంలో తాను అవసరమైన పత్రాలను సేకరిస్తానని తెలిపారు. పూజా ఖేద్క అప్పీల్‌పై యూపీఎస్సీ జూలై 30 మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆమెకు సమాధానం ఇచ్చేందుకు టైం ఇచ్చింది. ఇంత వరకు సమాధానం రాకపోవడంతో యూపీఎస్సీ ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలేంటి?
పూజా ఖేద్కర్ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఆమె ఫోటో, సంతకం, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చి నకిలీ గుర్తింపు కార్డులను పొందారని యూపీఎస్సీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూజా ఖేద్కర్ మోసపూరితంగా పరీక్షకు హాజరయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు పూజా ఖేద్కర్‌పై కేసు నమోదు చేశారు. పూజా ఖేద్కర్‌ను పూణే నుండి వాసీమ్‌కి బదిలీ చేశారు. అదనపు అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు. దీని తరువాత, జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ దివాసే.. పూజా ఖేద్కర్ ప్రవర్తన గురించి సీనియర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా తనకు అర్హత లేని సౌకర్యాలు కల్పించాలని పూజా ఖేద్కర్ డిమాండ్ చేశారని ఆరోపించారు. అంతే కాకుండా ఓ సీనియర్ అధికారి ఛాంబర్‌ను కూడా కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. పూజా ఖేద్కర్ తన పదవిని దుర్వినియోగం చేశారని కూడా ఆరోపించారు. పూజా ఖేద్కర్ తన వ్యక్తిగత ఆడి కారులో రెడ్ బీకాన్.. 'మహారాష్ట్ర గవర్నమెంట్' ప్లేట్‌లను అమర్చినట్లు సమాచారం. పూజా ఖేద్కర్ ఈ ప్రైవేట్ కారులో వాషిమ్ వీధుల్లో తిరుగుతూ కనిపించింది.