(Source: ECI/ABP News/ABP Majha)
Amit Shah: ఈ ఎన్నికలు దేశ 25 ఏళ్ల ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah Comments: ఇండియా గ్లోబల్ ఫోరమ్ 'ఎన్‌ఎక్స్‌టి 10' సమ్మిట్ ముంబయిలో జరగ్గా.. అందులో అమిత్ షా పాల్గొన్నారు.
Amit Shah Comments in India Global Forum 2024: దేశంలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలు 25 ఏళ్ల దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్ 'ఎన్‌ఎక్స్‌టి 10' సమ్మిట్ ముంబయిలో జరగ్గా.. అందులో అమిత్ షా పాల్గొన్నారు. ఈ వార్షిక పెట్టుబడి సదస్సు ‘ఎన్‌ఎక్స్‌టి 10’లో మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రాముఖ్యాన్ని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎన్నికలు ఆయా దేశాలకు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుండగా.. భారతదేశంలో జరగబోయే ఎన్నికలు మన దేశానికి రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రాబోయే దశాబ్దపు విజన్‌పై ఎంతో కచ్చితత్వంతో ఉందని అమిత్ షా అన్నారు. గత పదేళ్లలో చేపట్టిన ఆర్థిక, చట్టపరమైన, సామాజిక సంస్కరణలను అమిత్ షా గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ వివిధ రంగాలలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోబోయే వేళ.. వచ్చే ఐదేళ్లలో తీసుకునే నిర్ణయాలే భారతదేశ స్థితిని నిర్ణయిస్తాయని అన్నారు.
ప్లీనరీ సెషన్‌లో తన ప్రసంగంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అమిత్ షా ప్రస్తావించారు. ప్రధాని మోదీ ఈ పదేళ్లలో తీసుకువచ్చిన మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తేనే పూర్తిగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆగస్టు 15, 2047 నాటికి వందేళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత్ ను తయారు చేస్తామని చెప్పారు. అప్పటికల్లా టాప్ 3 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో దేశాన్ని భాగం చేస్తామని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, తాము రాబోయే 25 సంవత్సరాల కోసం రోడ్ మ్యాప్‌ను కలిగి ఉన్నామని అమిత్ షా చెప్పారు.