Vijay TVK Karur Stampede: విజయ్ ఇంకా నటుడే, నాయకుడైతే ఇంట్లో దాక్కోడు! బాధితుల్ని వదిలి వెళ్లడంపై తీవ్ర విమర్శలు
TVK Vijay Karur Stampede : టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ శనివారం కరూర్ లో నిర్వహించిన ప్రచారంలో తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. బాధితుల్ని పరామర్శించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Karur Stampede TVK Vijay: కరూర్: నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్ లో చేసిన పొలిటికల్ ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్ లోని వేలుచామిపురంలో విజయ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. వీరిలో 10 మంది చిన్నారులు, మరో 18 మంది వరకు మహిళలు ఉన్నారని సమచాారం. హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. అయితే టీవీకే అధ్యక్షుడు, నటుడు చేసిన పనికి ఆయన అభిమానులతో పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
39 మంది ప్రాణాలను బలిగొన్న విజయ్ ప్రచారం
తమిళగ వెట్రి కళగం(TVK) అధ్యక్షుడు విజయ్ ప్రతి శనివారం ప్రచారం చేస్తున్నారు. విజయ్ తన మూడో ప్రచారంలో భాగంగా నిన్న ఉదయం నామక్కల్ లో ప్రచారం చేశారు. రాత్రి కరూర్‌లో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయలో ఒక్కసారిగా కరెంట్ పోవడంతో ప్రజలు భయాందోళనకు గురికావడం తొక్కిసలాటకు దారితీసింది. 10 వేల మందికి పర్మిషన్ ఇవ్వగా 30 వేల మందికి పైగా ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారని అధికారులు చెబుతున్నారు.
విచారణకు కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాత్రివేళ కరూర్‌ను సందర్శించిన సీఎం స్టాలిన్ మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే జిల్లా కార్యదర్శిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పోలీసుల వైఫల్యం లేదని డీజీపీ వెంకటరామన్ తెలిపారు. 10 వేల మందికి అనుమతి ఇవ్వగా, దాదాపు 30 వేల మంది హాజరయ్యారని డీజీపీ తెలిపారు. కార్యక్రమానికి విజయ్ ఆలస్యంగా రావడంతోనే జనం పెరిగి తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు.
#WATCH | Tamil Nadu: TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay leaves from Trichy airport
— ANI (@ANI) September 27, 2025
A stampede took place during his public event in Karur.
Former Tamil Nadu Minister and DMK leader V Senthil Balaji said, "Till now, 31 people have died in the stampede and 58… pic.twitter.com/mnb1G2zncF
ప్రైవేట్ విమానంలో వెళ్లిపోయిన విజయ్
విజయ్ తన ప్రచారంలో జరిగిన తొక్కిసలాట బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని అంతా భావించారు. కానీ విజయ్ ప్రచారం ముగించుకుని రోడ్డు మార్గంలో తిరుచ్చికి వెళ్ళాడు, అక్కడి నుండి చెన్నైకి ప్రైవేట్ విమానంలో వెళ్లి పనయూర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తరువాత కరూర్ లో తన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి నివాళి అర్పించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కరూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించి, వారికి అండగా నిలవాల్సిందిపోయి ప్రైవేట్ విమానంలో ఇంటికి చేరుకుని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంపై తమిళనాడు ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
అలాంటప్పుడు ఆ పాట ఎందుకు ?
ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి విజయ్ కోసం తన సొంత పాట "ఉంగా విజయ్.. ఉంగా విజయ్.. ఆయేన వారన్నా" ను ప్లే చేస్తున్నారు. ఆ పాట లైన్లు నిజమైతే, అతను స్వయంగా వచ్చి బాధితులను ఎందుకు కలుసుకోలేదు? నేను మీకోసం వచ్చాను. మీ తరఫున ఉంటానని ప్రచారంలో చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా అని ప్రశ్నిస్తున్నారు.

ఇది కేవలం స్వార్థమా?
రజనీకాంత్, అజిత్ లాంటి వారిని రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరినా వారు ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు. తనను నమ్మి తన వెనుక వచ్చిన కోట్లాది మంది అభిమానులను నిరాశపరచకూడదని రజనీ అన్నారు. అదేవిధంగా, అభిమానులు తన వెనుక రాకుండా వారి జీవితాలను గడపాలని అజిత్ కుమార్ స్పష్టం చేశారు. కానీ విజయ్ తన అభిమానులను తమిళనాడు మార్పు కోసం నడిపిస్తానని రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతి ప్రచారంలో వాలంటీర్లను మండే ఎండలో గంటల తరబడి వేచి ఉండేలా ఎందుకు చేస్తున్నారని అలా కాక పోయింటే, నిన్నటి విషాదాన్ని నివారించవచ్చు. జనసమూహాన్ని చూపించడంతో పొలిటికల్ మైలేజ్ వస్తుందని అనుకున్నాడా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చిన విజయ్
విజయ్ నిన్న పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట అనంతరం స్పందించిన తీరు అటు అధికార డీఎంకే, ఇటు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అవకాశం ఇచ్చినట్లు అయింది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇదివరకే విజయ్ ను నీలాగ నేను వీకెండ్ రాజకీయ నాయకుడ్ని కాదని ఎద్దేవా చేశారు. తన కోసం వచ్చిన వారు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు ప్రాణాల కోసం హాస్పిటల్స్ లో పోరాడుతుంటే విజయ్ కనీసం అక్కడికి వెళ్లి వారికి అండగా ఉంటానని చెప్పని వ్యక్తి రాజకీయ నాయకుడు కాదని, అతనెప్పటికీ సినిమా హీరోనే అని విమర్శిస్తున్నారు.






















