Tulip Garden: కాశ్మీర్ లో "తులిప్ గార్డెన్ " టూరిస్టులను పిలుస్తోంది.. ఓపెనింగ్ ఎప్పుడంటే...
Indira Gandhi Memorial Tulip Garden | కాశ్మీర్ లో "తులిప్ గార్డెన్ " టూరిస్టులను పిలుస్తోంది.. త్వరలో తెరవబోతున్నట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.

Tourism In India | భూతల స్వర్గం కాశ్మీర్ లో ఎన్నో టూరిస్ట్ ఎట్రాక్షన్ లు ఉన్నాయి. ముఖ్యం గా శ్రీనగర్ లోని దాల్ లేక్, శంకరాచార్య టెంపుల్, లాల్ చౌక్ లతో పాటు పర్యాటకుల మనసు దోచే ఎన్నో గార్డెన్స్ ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిలోకి ముఖ్యమైనది "తులిప్ గార్డెన్ " (Tulip Garden). ప్రతి ఏటా మార్చి - ఏప్రిల్ మధ్యలో విరబూసే తులిప్ పుష్పాలను చూడ్డానికి ఎక్కడెక్కడ నుంచో టూరిస్ట్లు శ్రీనగర్ (Sri Nagar)కి క్యూ కడుతుంటారు. ఇదిగో అలా ఈ ఆడేది కూడా తులిప్ సీజన్ కు వేళయింది. ఈ నెల 15న (మార్చి 15) తులిప్ గార్డెన్ లను సందర్శకుల కోసం తెరవబోతున్నట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఉంది శ్రీ నగర్ లోనే
"ఇందిరా గాంధీ మెమోరియల్ (Indira Gandhi Memorial) తులిప్ గార్డెన్ " పేరుతో ఉన్న ఈ ఉద్యానవనం 74 ఎకరాల్లో విస్తరించి ఆసియా ఖండంలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ గా పేరు పొందింది. దాల్ సరస్సు కూ జబర్వాన్ పర్వతాలకు మధ్య నిర్మించిన ఈ గార్డెన్ కాశ్మీర్ టూరిజం లో చాలా ముఖ్యమైన భాగమైంది. 73 రకాల కు చెందిన రంగురంగుల తులిప్ మొక్కలు ఈ గార్డెన్లో 17 లక్షలు ఉన్నాయి. వీటన్నిటిని అమిస్టర్ డాం, హాలెండ్ లనుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. 2007 వరకూ సిరాజ్ గార్డెన్స్ పేరుతో ఉన్న ఈ ఉద్యానవనాన్ని పూర్తిగా ఆధుననీకరించి ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ గా పేరు మార్చారు.
ప్రతీ యేటా జరిగే "తులిప్ ఫెస్టివల్" .. 2024 లో రికార్డు స్థాయిలో పర్యాటకలు
ప్రతి సంవత్సరం శ్రీనగర్లో మార్చి ఏప్రిల్ నెలల్లో తులిప్ ఫెస్టివల్ జరుగుతుంది. 2024 లో రికార్డు స్థాయిలో 4 లక్షల 50 వేల మంది పర్యాటకులు తులిప్ ఫెస్టివల్ కు అటెండ్ అయ్యారు. వీరిలో 3,000 మందికి పైగా ఫారెన్ టూరిస్టులు. ఈ ఏడాది ఈ నెంబరు ఇంకా ఎక్కువ అవుతుందని భావిస్తున్నట్టు గార్డెన్ ఇంచార్జ్ జావెద్ తెలిపారు. మార్చి 15 నుండి ప్రారంభమయ్యే తులిప్ సీజన్ కోసం 100మంది కి పైగా గార్డెనర్స్, ఇతర పనివాళ్ళు శ్రమిస్తున్నారు. గతేడాది అంచనాలు మించి వచ్చిన టూరిస్టు ల కారణంగా వాహనాల పార్కింగ్కి చాలా ఇబ్బంది అయింది.ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసినట్టు కాశ్మీర్ అధికారులు చెప్తున్నారు.
శ్రీ నగర్ టూరిజనికి, అక్కడి లోకల్ వ్యాపారస్తులకు దాల్ లేక్, తులిప్ గార్డెన్ సీజన్ చాలా ముఖ్యమైనవి. ఈ ఏడాది మితిమీరి కురిసిన మంచు వల్ల జనవరి ఫిబ్రవరి నెలల్లో దాల్ లేక్ గడ్డ కట్టేసింది. దానితో ప్రస్తుత తులిప్ సీసన్ పై శ్రీనగర్ లోని లోకల్ వ్యాపారస్తులు, టూరిజం అధికారులు చాలా ఆశలు పెట్టుకున్నారు.





















