Tomato Price Hike: రోజురోజుకూ పెరుగుతున్న టమాటా ధర - మరో నెల రోజుల్లో కిలో రూ.300 దాటే అవకాశం
Tomato Price Hike: టమాటా ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 100 నుంచి 200 వరకూ ఉండగా మరో నెల రోజుల్లో కిలో టమాటాల ధర రూ.300 అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tomato Price Hike: దేశవ్యాప్తంగా టమాటాల ధర విపరీతంగా పెరుగుతోంది. అన్ని కూరగాయల ధరలు పెరుగుతున్నప్పటికీ.. టమాటా రేటు ఆకాశాన్ని అంటుతోంది. మరికొన్ని రోజుల్లో తగ్గుతుంది అనుకుంటుండగా.. వినియోగదారులకు షాక్ ఇస్తూనే వస్తోంది. దేశ రాజధాని ఝిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లోనూ టమాటాలు ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఢఇల్లలీతో పాటు సమీప ప్రాంతాలకు హిమాచల్ నుంచి టమాటా సరఫరా అయ్యేది. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడి నుంచి టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో టమాటా ధరలు రూ.300 దాటే అవకాశం కనిపిస్తోందని టమాటా వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ డేటా ప్రకారం.. ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో టమాటా హోన్ సేల్ కిలో రూ.203 ఉండగా.. రిటైల్ గా కిలో ధర రూ.250కి చేరుకుంది.
మరో నెల రోజుల్లో కిలో టమాటా ధర రూ.300కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని అన్నారు. గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమోటా సాగు దెబ్బతిందని.. వీటి ప్రభావం కూడా టమాటా ధరల పెరుగుదులపై పడుతుందని.. ఢిల్లీలోని ఆజాద్ పూర్ టమోటా అసోసియేషన్, వ్యవసాయం ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ సభ్యుడు అశోక్ కౌశిక్ తెలిపారు. హోల్ సేల్ టమాటా ధర కిలో 160 నుంచి 220 రూపాయలకు పెరిగిందని.. రిటైల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు.
మొన్నటికి మొన్న కిలో టమాటా రూ.213
అనంతపురం టమాటా మార్కెట్ లో రైతులకు రికార్డు స్థాయి ధరలు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 15 కిలోల టమాటా పెట్టె ధర రూ.3200 రూపాయలు పలికింది. ఏటా వర్షాభావంతో, అకాల వర్షాలతో, మార్కెట్ లో ధరలు పతనమై నష్టపోతున్న ఈసారి రికార్డు స్థాయి ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వారి ఊహించిన ధరకంటే 40 శాతం వరకు అధికంగా వస్తుండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతపురం టమాటా మండీలో నాణ్యత లేని టమాటా 15 కిలోల బాక్సు కనిష్టంగా 1600 ధర పలకగా, గరిష్టంగా 3200 రూపాయలతో రికార్డు నమోదు అయింది.
తమిళనాడులో కిలో రూ.250 కన్ఫార్మ్..!
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటల్లో వాడే నిత్యావసర సరుకు టమాటా ధర ఏకంగా డబుల్ సెంచరీ మార్క్ దాటింది. ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.200 మార్క్ చేరుకుంది. తాజాగా తమిళనాడులోనూ కేజీ టమాటా ధర రూ.200కు చేరింది. రాజధాని చెన్నైలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో నాణ్యమైన టమాటాను రూ.180 నుంచి రూ.200 రేటుకు విక్రయిస్తున్నారు. త్వరలోనే తమిళనాడులో టమాటా కేజీ ధర రూ.250 మార్క్ చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ.200 పలికింది. అయితే టమాటా ధర డబుల్ సెంచరీ మార్క్ చేయడం ఇదే తొలిసారి అని మార్కెట్ వ్యాపారుల సంఘం కార్యదర్శి సుకుమారన్ తెలిపారు. చెన్నైలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో నాణ్యమైన టమాటా కిలో రూ.185 పలకగా, గరిష్టంగా రూ.200 ధరకు చేరడంతో తమిళ ప్రజలు సైతం టమాటా కష్టాలను ఎదుర్కొంటున్నారు.