Tihar Jail Bomb Threat: తిహార్ జైలుకు బాంబు బెదిరింపులు, అధికారులు హైఅలర్ట్! అదే జైలులో ఎమ్మెల్సీ కవిత
Bomb Squad in Tihar Jail: తిహార్ జైలులో సాధారణ ఖైదీలతో పాటు నేరాలకు పాల్పడ్డ లేదా రిమాండ్ లో ఉన్న హై ప్రొఫైల్ వ్యక్తులు, రాజకీయ నాయకులు కూడా ఉండే సంగతి తెలిసిందే.
Tihar Jail News: ఢిల్లీలోని తిహార్ జైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ జైలులో బాంబు ఉన్నట్లుగా ఈ - మెయిల్ ద్వారా సమాచారం రావడంతో భద్రతా అధికారులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేయించారు. అంతకుముందు ఢిల్లీలోని కొన్ని పెద్ద హాస్పిటల్లకు కూడా బాంబ్ బెదిరింపుల ఈ మెయిల్స్ వచ్చాయి. వెంటనే సంబంధిత అధికారులు అలర్ట్ అయి తనిఖీలు చేపడుతున్నట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. తిహార్ జైలుకు డాగ్ స్క్వాడ్ లు, పోలీసులు చేరుకొని జైలులో, జైలు పరిసరాల్లో తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కి సంబంధించి అధికారులు దర్యాప్తు కూడా జరుపుతున్నారు.
తిహార్ జైలులో సాధారణ ఖైదీలతో పాటు నేరాలకు పాల్పడ్డ లేదా రిమాండ్ లో ఉన్న హై ప్రొఫైల్ వ్యక్తులు, రాజకీయ నాయకులు కూడా ఉండే సంగతి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం తిహార్ జైలులోనే రిమాండ్ లో ఉన్నారు.
మే 14న ఉదయం కూడా ఢిల్లీలోని దీప్ చంద్ బంధు హాస్పిటల్, జీటీబీ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్ లాంటి ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ అగ్ని మాపక విభాగం అధికారులు తెలిపారు. పోలీసులు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై ఆరా తీస్తున్నారు. గత వారం ఢిల్లీ ఎన్‌సీఆర్ లోని ఏకంగా 20 హాస్పిటళ్లకు, ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు సహా, నార్తర్న్ రైల్వే సీపీఆర్వో ఆఫీసుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అంతకుముందు 150 స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం సంచలనంగా మారింది.
అయితే, ఈ స్కూళ్లకు వచ్చిన మెయిల్స్ కు రష్యా మూలాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గత వారం హాస్పిటల్లకు వచ్చిన బెదిరింపు మెయిల్స్ యూరప్ బేస్డ్ మెయిలింగ్ కంపెనీ beeble.com నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.