Isha Foundation: ఇషా యోగా సెంటర్‌లో పోలీసుల తనిఖీలు- కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఖాకీలు
Tamilnadu news: తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా యోగా సెంటర్‌లో పోలీసుల, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. కామరాజ్ అనే వ్యక్తి వేసిన పటిషన్ విచారించిన కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది.
Tamil Nadu News: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇషా ఫౌండేషన్‌పై నమోదైన నమోదైనన కేసులపై నివేదిక ఇవ్వాలని మద్రాసు హైకోర్టు కోరిన తర్వాత తర్వాత రోజు నుంచే ఈ తనిఖీలు మొదలయ్యాయి. కోయంబత్తూరుకు చెందిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని 150 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. తొండముత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్ ఆశ్రమం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ సెర్చ్ ఆపరేషన్ టీంలో ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ ఆశ్రమంలో ఉంటున్న వారిపై ఆరా తీయడం ఫౌండేషన్‌లో ఉన్న గదులను పరిశీలించామన్నారు పోలీసు అధికారులు.
ఈ తనిఖీలపై ఇషా యోగా కేంద్రం కూడా స్పందించింది. వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న సాధారమైమన విచారణగా పేర్కొంది. కోర్టు ఆదేశాలతో సాధారణ విచారణ కోసం ఎస్పీ సహా పోలీసులు ఈశా యోగా కేంద్రానికి వచ్చారని వెల్లడించింది. అక్కడ ఉండే వారితోపాటు వాలంటీర్లను ప్రశ్నించారు. వారి జీవనశైలి అడిగి తెలుసుకున్నారు. వారు ఎలా వచ్చారనే విషయంపై ఆరా తీశారు. అని ఒక ప్రకటనలో ఈషా యోగా కేంద్రం తెలిపింది.
ఇద్దరు కూతుళ్లు గీతాకామరాజ్ (42), లతా కామరాజ్ (39) ఇషా ఫౌండేషన్ కేంద్రంలో బంధీలుగా ఉండిపోయారని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఇద్దరు కుమార్తెలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని హెబియస్ కార్పస్ పిటిషన్‌పై వేశారు. దీనిపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేకి ఇవ్వాలని కోయంబత్తూరు రూరల్ పోలీసులను కోర్టు ఆదేశించింది. కొందరిని బ్రెయిన్ వాష్ చేసి తమ వద్ద ఉండిపోయేలా చేస్తోందని, బలవంతంగా సన్యాసులుగా కోయంబత్తూరులోని ఫౌండేషన్ మారుస్తోందని, కుటుంబాలతో కలవనీయకుండా దారుణంగా ఉంటోందని పిటిషనర్ కోర్టులో వాదించారు.
కోయంబత్తూరులోని వెల్లియంగిరి పర్వత ప్రాంతంలోని సంస్థ యోగా కేంద్రంలో తన ఇద్దరు కూతుళ్లను బంధించారని పిటిషనర్ చెప్పారు. అయితే తమ ఇష్ట ప్రకారమే అక్కడ ఉన్నారని ఇషా సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఫౌండేషన్‌లో చేరడానికి ముందు తన కుమార్తెలు సాధించిన విజయాలు, జీవించిన విధానం గురించి కోర్టుకు కామరాజ్ వివరించారు. పెద్ద కుమార్తె UKలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి మెకాట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అని తెలిపారు. మంచి లైఫ్‌ను వదిలేసి 2008లో భర్తకు విడాకులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. విడాకుల తరువాత ఫౌండేషన్‌లో యోగా తరగతులకు హాజరైనట్టు చెప్పారు. ఇలా ఒక కుమార్తె తర్వాత ఒకరు ఆ సంస్థలో చేరిపోయారని వాపోయారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన చిన్న కుమార్తె కూడా తన అక్కను అనుసరించిందన్నారు కామరాజ్. ఫౌండేషన్ తన కుమార్తెలకు ఆహారం, మందులు ఇచ్చి విచక్షణా కోల్పోయేలా చేశారని దీంతో కుటుంబంతో అన్ని సంబంధాలను తెంచుకోవడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. ఫౌండేషన్ కొంతమంది వ్యక్తులు బ్రెయిన్ వాష్ చేసి వారిని సన్యాసులుగా మార్చేస్తున్నారని, తల్లిదండ్రులు, బంధువులను కలిసేందుకు కూడా అనుమతివ్వడం లేదని ఆరోపించారు. దీంతోపాటు గతంలో వచ్చిన అనేక ఆరోపణలను పిటిషనర్ వివరంగా కోర్టుకు తెలిపారు.
ఫౌండేషన్‌లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌పై పోక్సో కేసు పెట్టిన సంగతిని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇంకా ఏమన్నారంటే..."ఇటీవల అదే సంస్థలో పని చేస్తున్న ఒక వైద్యునిపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదైంది. ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడనేది సదరు వ్యక్తిపై వచ్చిన ఆరోపణ'' అని పేర్కొన్నారు.
కామరాజ్ కుమార్తెలు స్వచ్ఛందంగా ఉన్నట్టు ఇషా ఫౌండేషన్, చెప్పినప్పటికీ కోర్టుకు నమ్మకం కుదర్లేదు. " తన కూతుర్ని ఘనంగా పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి ఇతరుల కూతుళ్లను సన్యాసినులుగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అనేదే సందేహం ఉందనిదానిపై ఆరా తీయాలని ' అని జస్టిస్ శివజ్ఞానం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇషా యోగా కేంద్రంపై తన తండ్రి పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు చిన్న కూతురు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు తండ్రికి పెద్ద కుమార్తె సమాచారం అందించింది. దీనిపై కూడా పోలీసులు విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దాని ఆధారంగా కోయంబత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్తికేయ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు యోగా కేంద్రంలో విచారణ జరుపుతున్నారు. యోగా సెంటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడి వచ్చే భక్తులను సైతం కొంత దూరంలో నిలిపివేస్తున్నట్లు సమాచారం.