Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య- ఫుడ్ డెలవరీ బాయ్స్‌గా వచ్చిన దుండగులు
Tamil Nadu BSP President Armstrong: తమిళనాడులో రాజకీయ కలకలం రేగింది. ఆ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం సంచలనంగా మారింది.
Tamil Nadu Crime News: తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు దారుణ హత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చెన్నై పెరంబూర్‌లో నివాసం దుండగులు హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఇంటి వద్ద నిల్చొని ఉన్న టైంలో కత్తులతో నరికి హత్య చేశారు. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు టూవీలర్స్‌పై వచ్చి ఇంటి ముందు నిలబడి ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పరారయ్యారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. థౌజండ్‌లైట్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు మృతి చెందారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌తోపాటు ఉన్న మరో ఇద్దరిపై కూడా ఆగంతకులు దాడి చేశారు. హతమార్చే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనపై సెంబియం పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు చెప్పిన ఆనవాళ్లు, సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకొని నిందితులను పసిగట్టారు. ఆ ఏరియాలో ఉన్న ఫోన్ సిగ్నల్స్‌ను కూడా పోలీసులు ట్రాక్ చేశారు. ఇదంతా ప్రతీకారం తీర్చుకునేందుకు చేసిన హత్యగా పోలీసులు చెబుతున్నారు.
ఆర్మ్‌స్ట్రాంగ్‌పై చాలా పెండింగ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. గతంలో పలు ఘర్షణల్లో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉందని అందులోని వాళ్లు ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లాస్ట్ ఇయర్ మర్డర్ అయిన గ్యాంగ్‌స్టర్ అర్కాట్ సురేశ్ అనుచరులే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తెలిపారు పోలీసులు. అర్కాట్ సురేశ్ హత్యకు ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రధాన కారణమని భావించి హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది.
కీలకమైన నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌లా వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారని పేర్కొన్నారు.
తిరుపతి ఎస్వీ యూనివర్శీటీలోనే ఆర్మ్‌స్ట్రాంగ్ చదువుకున్నారు. ఇక్కడ న్యాయవిద్యను అభ్యసించిన తర్వాత చెన్నైలో ప్రాక్టీస్ చేశారు. తర్వాత 2006లో కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయం అరంగేట్రం చేశారు. తర్వాత ఓ మెగా ర్యాలీతో బీఎస్పీ అధినేత్ర దృష్టిలో పడి బీఎస్పీలో చేరిపోయారు.
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది. ఎక్స్‌లో స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి...ఇంటి వద్ద ఓ పార్టీ అధ్యక్షుడిని హత్య చేయడం విచారకరమన్నారు. బలంగా దళిత వాణి వినిపించే నాయకుడిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని ఆకాంక్షించారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే నేత పళని స్వామి విమర్శలు చేశారు. ఓ జాతీయ స్థాయి నాయకుడు హత్య కావడం ఏంటని ప్రశ్నించారు.