Air Pollution: 'పంట వ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం' - వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Supreme court: ఢిల్లీలో అధిక వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాలు తగలబెట్టడాన్ని ఆపాలని ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలను ఆదేశించింది.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యూ ఢిల్లీ సహా ఉత్తరాది ప్రాంతాలను వాయు కాలుష్యం కోరల్లో బందీ చేస్తోన్న పంట వ్యర్థాల కాల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'పంట వ్యర్థాలు తగలబెట్టడం హత్యతో సమానం' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ - ఎన్ సీఆర్ ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను మంగళవారం విచారించింది. నానాటికీ క్షిణిస్తోన్న గాలి నాణ్యత, ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన పంట వ్యర్థాల దగ్ధాన్ని వెంటనే ఆపాలని పంజాబ్, రాజస్థాన్, యూపీ, హరియాణా రాష్ట్రాలను ఆదేశించింది.
'అది మీ పని'
వాయు కాలుష్యం విషయంలో ప్రభుత్వాల తీరును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. 'ప్రతి ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్యం కోరల్లో నలిగిపోకూడదు. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దగ్ధం చేయడంతో ఏటా శీతాకాలంలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ పంట వ్యర్థాల దగ్ధం ఆపాలి. అది ఎలా ఆపుతారో మాకు సంబంధం లేదు. అది మీ పని. కానీ ఇది తక్షణమే జరగాలి.' అంటూ ప్రభుత్వాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ ప్రభుత్వానికి సూచనలు
కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి సైతం సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. 'ఢిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఘన వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు చేపట్టాలి. బస్సులు కూడా కాలుష్యానికి కారణం. వాటిని సగం సామర్థ్యంతో నడపండి. సరి - బేసి విధానాలు కాలుష్యం నియంత్రణపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు' అంటూ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
పంట వ్యర్థాల దగ్ధంపై సీరియస్
పంట వ్యర్థాల దగ్ధంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, యూపీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించాలని సూచించింది. 'ఆర్థిక కారణాలతో రైతులు పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించేందుకు తగిన చేయూత ప్రభుత్వమే కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం సైతం రాయితీలు అందించాలి. వరి సాగును దశల వారీగా తగ్గిస్తూ ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. వాటికి తగిన గిట్టుబాటు ధర అందించేలా చర్యలు చేపట్టాలి.' అని ధర్మాసనం సూచించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ సర్కారు కీలక చర్యలు
అటు, ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోన్న క్రమంలో, కాలుష్య నివారణకు ఆమ్ ఆద్మీ సర్కారు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13 నుంచి 20 వరకూ వాహనాలకు సరి - బేసి విధానం అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రధాన నిర్మాణ స్థలాల్లో మొత్తం 233 యాంటీ స్మాగ్ గన్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఢిల్లీలో బహిరంగంగా చెత్తను కాల్చడాన్ని అరికట్టేందుకు మొత్తం 611 బృందాలను నియమించినట్లు చెప్పింది.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు, కేంద్రానికి కొలిజీయం సిఫార్సు