మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీం సీరియస్, ఉత్తర్వులు ఉల్లంఘించలేరని కామెంట్స్
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయలేరని ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వండంటూ అత్యున్నత ధర్మాసనం మండిపడింది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయలేరని ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వండంటూ అత్యున్నత ధర్మాసనం మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన ధర్మాసనం షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా అలసత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నిర్ణీత కాలవ్యవధిని ప్రకటించి చర్యల ప్రక్రియను ప్రారంభించాలని, తమ ఆదేశాలను అనుసరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని, సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలవ్యవధిని చెప్పాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబరు 18న ఆదేశించింది. అంతకుముందు జులైలో నోటీసు జారీ చేసింది.
సుప్రీం ఆదేశించినా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు, ఎన్సీపీలోని శరద్ పవార్ మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో కాల వ్యవధి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ హెచ్చరించారు. స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి సంతృప్తిగా లేకపోతే, ఉల్లంఘించడానికి వీల్లేని విధంగా మంగళవారం ఉత్తర్వులిస్తామని స్పష్టం చేశారు. జులై నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని, పురోగతి ఎందుకు లేదని ప్రశ్నించింది. న్యాయస్థానం హుందాతనాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న చంద్రచూడ్, స్పీకర్ కార్యాలయాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే నిర్ణీత కాలవ్యవధిలోగా చర్యలు ఉండాలని గతంలో సూచించామన్నారు. లేదంటే 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చే వాళ్లమని తెలిపారు.
తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో జట్టు కట్టారు ఏక్ నాథ్ శిండే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా శిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు. మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్ షిండే, 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లోక వచ్చారు. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాణే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు అందుకున్నారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఠాణే ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు ప్రకాశ్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.