Special Parliament Session: కొత్త పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు, వినాయక చవితి రోజే ప్రారంభం
Special Parliament Session: సెప్టెంబర్ 19న కొత్త పార్లమెంట్ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Special Parliament Session:
సెప్టెంబర్ 19న కొత్త పార్లమెంట్‌లో..
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. అయితే...ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ బిల్డింగ్‌లో జరుగుతాయా..? లేదంటో కొత్త భవనంలో నిర్వహిస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 18న అంటే...తొలి రోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఆ తరవాత సెప్టెంబర్ 19న వినాయక చవితి ( Ganesh Chaturthi) సందర్భంగా కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు వెల్లడించింది. అంటే...సెప్టెంబర్ 19-23 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే...ఇప్పటి వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటన్నది స్పష్టంగా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ప్రశ్నించగా...త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే Sengolని ఏర్పాటు చేశారు.
The Special Session of Parliament will start in the old building on 18th September and will be later moved to the new building on 19th September on the occasion of Ganesh Chaturthi: Sources pic.twitter.com/nMS1nr3WsB
— ANI (@ANI) September 6, 2023
ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్ల నుంచి ఇటీవలే అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెషన్లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి 17వ లోక్‌సభ పదమూడో సమావేశాలు ప్రారంభమవుతాయని సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 18న సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు సభ్యులకు సమాచారం ఇస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సమావేశాలపై ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ రెండు వందల అరవై ఒకటో సెషన్ సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమవుతుందని, ఈ మేరకు సభ్యులకు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సమావేశాల అజెండాను రహస్యంగా ఉంచారు. దీంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read: మాకో మాటైనా చెప్పాలిగా, ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి? ప్రధానికి సోనియా గాంధీ లేఖ