(Source: ECI/ABP News/ABP Majha)
లోక్‌సభలో అంతరాయాలపై స్పీకర్ అసంతృప్తి- సభ్యుల ప్రవర్తనలో మార్పు వచ్చాకే రావాలని ఓం బిర్లా నిర్ణయం
పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కామన్ అయిపోయింది. దీనిపై లోస్‌సభ స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన సభకు రావడం లేదని సమాచారం.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 20 రోజులు అవుతుంది. ప్రతి రోజూ సమావేశం ప్రారంభం కావడం, మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడటం తర్వాత మళ్లీ పునఃప్రారంభమై తర్వాత రోజుకు వాయిదా పడటం మామూలైపోయింది.
మణిపూర్ అల్లర్లపై చర్చ జరపాలంటూ, ప్రధాని స్పందించాలని విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దానికి పోటీగా అధికార పక్షం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఇలా పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సభ్యులు సభ గౌరవం కాపాడేలా ప్రవర్తించే వరకు తాను సమావేశాలకు హాజరు కాబోనని ఓం బిర్లా అన్నట్టు తెలుస్తోంది. బుధవారం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు బిర్లా స్పీకర్ రాలేదు. ఆయన బదులు డిప్యూటీ స్పీకర్ సభా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సభలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. ఎప్పటి మాదిరిగానే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత సమావేశమైనా సభ్యుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో గురువారానికి సభ వాయిదా పడింది.
మణిపూర్ సమస్యపై ప్రతిపక్ష సభ్యులు నిరసనలను కొనసాగిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ దిగువ సభను స్తంభింపజేస్తున్నాయి.
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023, దిగువ సభలో ప్రవేశ పెట్టారు. పలు దఫాల వాయిదా కారణంగా ఆ బిల్లుపై చర్చ జరగలేదు. ఓటింగ్ కూడా జరిగే పరిస్థితి లేకపోయింది.
ఇలా లోక్‌సభలో బిల్లుల ఆమోదం సందర్భంగా విపక్షాలు, అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనతో బిర్లా అసహనంగా ఉన్నారు. సభా గౌరవాన్ని స్పీకర్ అత్యంత గౌరవంగా చూస్తారని, సభా కార్యకలాపాల సమయంలో సభ్యులు మర్యాదపూర్వకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పదే పదే కార్యకలాపాలకు అంతరాయాలు కలుగుతుండటంపై స్పీకర్ తన అసంతృప్తిని సభలోనే పలుమార్లు తెలియజేశారు. అయినా సభ్యుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆయన సభకు రావడం మానేసినట్టు తెలుస్తోంది.