Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం, పిడుగుపాటుకు ఏడుగురు మృతి - సీఎం దిగ్భ్రాంతి
Crime News in Telugu | ఛత్తీస్‌గఢ్‌లో విషాదం జరిగింది. పిడుగుపాటు ఏడుగురి ప్రాణాలు తీసింది. మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Lightning Strike in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షం పెను విషాదం మిగిల్చింది. వర్షం నుంచి తప్పించుకునేందుకు... చెట్టు కిందకి వెళ్లినవారు.. పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు మృతిచెందగా... నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరం... బలోదాబజార్ జిల్లాలోని మొహతారా గ్రామంలో జరిగింది. గాయపడిన వారికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పడుగుపాటు చెట్టుకింద ఉన్న మనుషుల శరీరాలు కాలిపోయాయి. సంఘటనాస్థలంలో పరిస్థితి భయానకంగా ఉంది. ఏడుగురు మృతిచెందగా... మిగిలినవారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
అసలు ఏం జరిగిందంటే...?
బలోదా బజార్ జిల్లా (Baloda bazar District) సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొహతారా గ్రామం(Mohatara village)లో.. ఇవాళ (సెప్టెంబర్ 8వ తేదీ) సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కుండపోత కురిసింది. ఈ సమయంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న 11 మంది... వర్షంలో తడవకుండా ఉండేందుకు.. పక్కనే చెరువుకట్టపై ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో... ఆ చెట్టుపై పెద్ద పిడుగుపడింది. దీంతో.. చెట్టుకింద ఉన్న 11 మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులను మార్చురీకి.. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. మృతులంతా పురుషులే అని... 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారే అని అధికారులు గుర్తించారు.
మృతుల వివరాలు
మృతులను ముఖేష్(20), తంకర్ (30), సంతోష్ (40), థానేశ్వర్(18), పోక్రాజ్(38), దేవ్(22), విజయ్(23)గా గుర్తించారు. విశ్వంభర్, బిట్టు సాహు, చేతన్ సాహు గాయపడినట్టు తెలిపారు. ఒకే గ్రామంలో ఏడుగురు మృతిచెందడంతో... గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని కోల్పోయి.. గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. పొలం పనులు ముగించుకుని.. కాసేపట్లో ఇంటికి వెళ్లిపోదామనుకునే లోపు.. మృతువు పిడుగు రూపంలో వారిని వెంటాడింది. ఏడు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. వర్షం నుంచి తప్పించునేందుకు తలదాచుకున్న చెట్టు కిందే... ప్రాణాలు విడిచారు.
ప్రమాదంపై సీఎం ఏమన్నారంటే..?
పిడుగు పడి ఏడుగురు మృతిచెందిన విషాద ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి (CM Vishnu Devsai) విచారం వ్యక్తం ఏశారు. పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందడం బాధకలిగించిందని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
వర్షం పడుతున్నప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తలు...
వర్షం పడుతున్నప్పుడు.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంటే.. అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడుతుంది కదా అని హడావుడిగా చెట్ల కిందకు పరిగెట్టకూడదు. చెట్ల కింద నిలబడితే.. పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చెట్లకు దగ్గరగా కూడా ఉండకూడదు. అలాగే.. విద్యుత్ స్తంభాలు, టవర్స్ కిందకు వెళ్లకూడదు. వీలైంత వరకు ఎత్తైన భవనాల కింద ఉండాలి. అప్పుడే పిడుగుల నుంచి తప్పించుకోవచ్చు.
Also Read: భారత్‌లో చేరాలని పీఓకే ప్రజలకు రాజ్‌నాథ్‌సింగ్ పిలుపు - బాగా చూసుకుంటామని హామీ