Nupur Sharma Remarks Row: నుపుర్ శర్మపై సుప్రీం వ్యాఖ్యలు దురదృష్టకరం- విశ్రాంత న్యాయమూర్తుల బహిరంగ లేఖ
Nupur Sharma Remarks Row: నుపుర్ శర్మపై ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు ఓ బహిరంగ లేఖ రాశారు.
Nupur Sharma Remarks Row: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండైన నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. సర్వోన్నత న్యాయస్థానం లక్షణ రేఖను దాటిందని, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు లేఖ రాశారు.
100 మందికి పైగా
ఈ లేఖపై 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు, 77 మంది ఆలిండియా సర్వీసెస్ మాజీ అధికారులు, 25 మంది రక్షణ దళాల మాజీ అధికారులు సంతకాలు చేశారు.
సుప్రీం వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్త విషయంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని సుప్రీం తెలిపింది.
తనకు ఉన్న ప్రాణ హాని, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాజపా బహిష్కృత నేతపై సుప్రీం కోర్టు మండిపడింది.