Article 370 Case: ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
Article 370 Case: ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యింది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాకల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో సంజయ్ కిషన్ కైల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై పదహారు రోజుల పాటు విచారణ చేపట్టింది. సుదీర్ఘమైన వాదనలు విన్న అనంతరం కోర్టు దీనిపై తీర్పును రిజర్వులో పెట్టింది. పిటిషనర్లు లేదా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు ఇంకా ఎవరైనా రాతపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే వచ్చే మూడు రోజుల్లో వాటిని కోర్టుకు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఆ వాదనలు రెండు పేజీల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది.
సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దు కేసులో జరిగిన వాదనలతో తాను సంతృప్తిగా ఉన్నానని, అన్ని అంశాలపై వాదనలు మంచిగా జరిగాయని ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది వెల్లడించారు. చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే తదితరులు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్స్ హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి గిరి వాదనలు వినిపించారు.
2019 ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. దీంతో పలువురి నుంచి వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. చట్ట పరంగా ఇలా చేయొచ్చా లేదా కేంద్రానికి ఎంత వరకు అధికారం ఉందనే అనే అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. జమ్ముకశ్మీర్ పునర్వవస్థీకరణ చట్టం చెల్లుబాటు గురించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లకు సంబంధించి కోర్టు అనుకూల, ప్రతికూల పార్టీల నుంచి రాతపూర్వక వివరణలను ఈ ఏడాది జులై 27 వరకు తీసుకుంది. తర్వాత ఆగస్టు 2వ తేదీ వరకు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై కేంద్రం వాదన ప్రకారం.. జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని తెలిపింది. రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించడానికి అవసరమైన నియమావళిని రూపొందిస్తున్నామని, దానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లో ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టంచేసింది. అయితే లద్ధాఖ్ సంబంధించినంత వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.