'భద్రతపై హామీ ఇస్తే పరిశీలిస్తాం' - వీసాల జారీపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
Jai shankar: భారత్ దౌత్యవేత్తల భద్రతకు కెనడాలో హామీ లభిస్తేనే ఆ దేశానికి వీసాల జారీని పునరుద్ధరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.
Jai shankar: భారత్, కెనడా మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత్ దౌత్యవేత్తల భద్రతకు కెనడాలో హామీ లభిస్తేనే, ఆ దేశానికి వీసాల జారీని పునరుద్ధరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడం వియన్నా ఒడంబడిక ప్రకారం ప్రాథమిక బాధ్యత అన్న ఆయన, ఆ ప్రాథమిక అంశానికి కెనడాలో సవాల్ ఎదురవుతోందన్నారు. పరిస్థితులు మెరుగైతే వీసాల జారీని మళ్లీ పరిశీలిస్తామన్నారు. వీసాల అంశంపై అందరికీ ఆందోళన ఉందన్న జైశంకర్, అయితే తమ దౌత్యవేత్తల రక్షణే చాలా కీలకమని వెల్లడించారు. కెనడాలో కార్యాలయానికి వెళ్లి అధికారులు వీసాలు మంజూరు చేసే పరిస్థితి లేదన్నారు. వీసాలను తాత్కాలికంగా నిలిపివేశామన్న జైశంకర్, పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోమని కెనడాను భారత్ కోరడాన్ని సమర్థించారు.
41 దౌత్య సిబ్బంది వెనక్కు
కొన్ని రోజుల క్రితం భారత్‌లోని దౌత్య సిబ్బందిలో 41 మందితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా ప్రకటించింది. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ హెచ్చరించింది. దీంతో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు కెనడా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు. దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణ ఉపసంహరించుకోవడమనేది అనూహ్యమైన చర్య అని కెనడా వ్యాఖ్యానించింది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది.
కెనడా మరోసారి కవ్వింపులు
భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసి కెనడా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. ఇది భారత్ కు ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కెనడా అక్కసు వెళ్లగక్కడంపై భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ఢిల్లీ, ఒట్టావా దౌత్య సంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1 నిబంధనలకు అనుగుణంగానే దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
వియన్నా ఒప్పంద సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై ఢిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని బైడెన్ స్పష్టం చేశారు. భారత్‌లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఢిల్లీ డిమాండ్ చేయడం, దానికి ప్రతిస్పందనగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు మంచింది కాదన్నారు. విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరమన్న బైడెన్, దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కెనడాపై భారత్ ఒత్తిడి చేయవద్దని సూచించారు. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరారు. 1961 నాటి వియన్నా ఒప్పంద సూత్రాల కింద దౌత్య సంబంధాలకు భారత్ కట్టుబడి ఉండాలన్నారు. కెనడా దౌత్య మిషన్‌లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ కల్పించాలని బైడెన్ సూచించారు.