(Source: ECI/ABP News/ABP Majha)
AI In Real Estate News: ఎన్నికల వేళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్- AIతో భూములు ధరలకు రెక్కలు!
Real Estate : భారత్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలకు బూమ్ రానుందా? విస్తరించనున్న డేటా సెంటర్ల ఏర్పాటుతో రియల్ రంగం పుంజుకోనుందా? రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలు ఏం చెబుతున్నాయి!
JLL report On Real Estate: ఒకప్పుడు పారిశ్రామికంగా ఎదిగిన భారత దేశం(INDIA).. ఇప్పుడు సాంకేతికంగా కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అందివస్తున్న సాంకేతికతను వినియోగించుకోవడంలో భారత్ ఇప్పుడు ముందంజలో ఉంది. ఈ క్రమంలో 2026 నాటికి అంటే కేవలం రెండేళ్లలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence-AI) ఆధారిత డేటా సెంటర్ల పరిశ్రమలు భారత్‌లో పెరగనున్నాయి. ఇదే జరిగితే.. రియల్ ఎస్టేట్ రంగంలో బూమ్ వస్తుందని, అదనంగా 100 లక్షల చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ స్థలం అవసరం అవుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
నివేదికలో ఏముందంటే..
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో డేటా సెంటర్ల పరిశ్రమ రానున్న రెండేళ్లలో జోరుగా విస్తరించనుంది. ఏకంగా 5.7 బిలియన్ అమెరికా డాలర్ల(47 వేల 408 కోట్ల 43 లక్షల 90 వేల రూపాయలు) పెట్టుబడులను ఈ సంస్థలు ఆకర్షించనున్నాయి. ఈ పరిశ్రమల విస్తరణ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోనుంది. ఇక, డేటా సెంటర్ల పెంపుతో 2026 నాటికి 791 మెగా వాట్ల (MW) డేటా పెరుగుతుంది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence-AI)ను అందిపుచ్చుకోవడంలో భాగంగా జరిగే ప్రక్రియేనని నివేదిక వెల్లడించింది. అయితే.. ఇలా విస్తరిస్తున్న డేటా సెంటర్ల కారణంగా విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరగనున్నట్టు నివేదిక వివరించింది.
ఏఐ వినియోగం పెంచుతుండడంతో 2024-26 మధ్య కాలంలో డేటా కేంద్రాల డిమాండ్ వినియోగం 650 నుంచి 800 మెగా వాట్లకు పెరిగే అవకాశం ఉందని JLL నివేదిక తెలిపింది. భారత్‌లో కంప్యూటింగ్, అప్లికేషన్ల పెరుగుదలతో భారత్‌లో డేటా కేంద్రాలకు భారీ ఆదరణ లభిస్తుందని నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు (CSPs) సమాచార సాంకేతిక మౌలిక సదుపాయాలను కల్పించనున్నాయి. డేటా నిల్వ, కంప్యూటింగ్ పవర్‌లను ఇంటర్‌నెట్ ద్వారా CSPsలు అందించనున్నాయి. ఇదేసమయంలో AI ఆధారిత పరిశ్రమలను మరింత వృద్ధి చేసేందుకు పెట్టుబడులను కూడా సమీకరించనున్నాయి.
కొత్త డేటా సెంటర్ల అవసరం!
AI తో నడిచే ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా వాల్యూమ్‌లలో పెరుగుదల శక్తి, ప్రాసెసింగ్ సహా ఇతర అవసరాలను సమకూర్చేందు కు కొత్త డేటా సెంటర్ల అవసరం ఉందని APAC లీడ్ – డేటా సెంటర్ లీజింగ్ మరియు హెడ్ – డేటా సెంటర్ అడ్వైజరీ, JLL భారత ప్రతినిధి రచిత్ మోహన్ తెలిపారు. విభిన్న AI విభాగాల విస్తరణ, అభివృద్ది కారణంగా డేటా సెంటర్‌లకు అదనపు డిమాండ్ వస్తుందన్నారు. వాటి సామర్థ్య అవసరాలను విస్తరించడం, అభివృద్ధి చేయడం వంటివి అంచనా వేసినట్టు తెలిపారు.
గత 2022 ద్వితీయార్థంలో 72 మెగా వాట్లు(MW)గా ఉన్న వినియోగం.. 2023 ద్వితీయార్థానికి వచ్చే సరికి 12 శాతం పెరిగినట్టు నివేదిక వివరించింది. దీంతో 2023 ద్వితీయార్థానికి 81 మెగా వాట్ల(MW) వినియోగం పెరిగినట్టు పేర్కొంది. 2023 ప్రథమార్థం తర్వాత.. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు (CSPs) పుంజుకోవడమే దీనికి కారణమని తెలిపింది. మరీ ముఖ్యంగా ముంబైలో ఈ వినియోగం రెట్టింపు అయినట్టు పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు(CSPs) వేగాన్ని పెంచడంతో వినియోగం కూడా పెరిగినట్టు తెలిపింది.
2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. దీనికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సుమారు 20 శాతం తోడ్పడనుంది. 2023లో 853 మెగావాట్ల నుంచి 2026 నాటికి 1,645 మెగావాట్లకు దేశ డేటా సెంటర్ పరిశ్రమ పెరుగుతుందని అంచనా. ఈ సామర్థ్యం పెరుగుదలకు 47 వేల 408 కోట్ల 43 లక్షల 90 వేల రూపాయల పెట్టుబడులు అవసరం కానున్నాయి. అదేసమయంలో 100 లక్షల చదరపు అడుగుల మేరకు రియల్ ఎస్టేట్ విస్తరించనుంది. అని హెడ్ ఆఫ్ రీసెర్చ్ & REIS, India, JLL ముఖ్య ఆర్థిక వేత్త సమంతక్ దాస్(Samantak Das) తెలిపారు.