వాహనం నడపాలంటే వచ్చే నెల నుంచి ఈ రూల్స్ తప్పనిసరి
దేశంలో వాహన తయారీ సంస్థలు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ప్రమాణాలు పాటించడం కేంద్రం తప్పనిసరి చేసింది. వచ్చే నెల నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Real Driving Emissions Rules : పెరుగుతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడే కాలుష్యంతో రోజురోజుకు ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నివారణకు ప్రపంచదేశాలన్నీ ప్రణాళికలు రూపొందించుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తున్నాయి. మన దేశంలోనూ కర్బన ఉద్గారాల నియంత్రణకు నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఎస్-6 ప్రమాణాలను అమలు తప్పనిసరి చేస్తోంది. వచ్చే నెల నుంచి రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు అమలుచేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇకపై వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌లు, స్కూటర్లు, కమర్షియల్ వెహికల్స తయారీలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అంటే ఏంటి.. వీటిని కార్లు, బైక్‌లు, స్కూటర్లు, కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు ఎందుకు పాటించాలి? ఆర్డీఈ నిబంధనలు అమలు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలతో వాయు కాలుష్యం పెరగకుండా ఈయూ దేశాలు ‘యూరో ఎమిషన్’ ప్రమాణాలు సిద్ధం చేశాయి. ఈయూ ఆధ్వర్యంలోని యూరో ఎమిషన్ ప్రమాణాల ఆధారంగా 2000లో కేంద్రం.. భారత్ స్టాండర్డ్ -1 (బీఎస్-1) ప్రమాణాలు అమల్లోకి తెచ్చింది. వీటికి రూపుదిద్దిన భారత కాలుష్య నియంత్రణ మండలి అటుపై బీఎస్-2, బీఎస్-3, బీఎస్-4 పేరిట అప్‌గ్రేడ్ చేసింది. అనంతరం 2020లో కేంద్ర ప్రభుత్వం బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి తెచ్చింది. బీఎస్-6 ప్రమాణాల ప్రకారం వాహనాలు విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్, నైట్రోజన ఆక్సైడ్ తదితర ఉద్గారాలు పరిధికి లోబడి ఉండాలి. ఇందుకు అనుగుణంగా కార్లు, బైక్‌లు, స్కూటర్లు, వాణిజ్య వాహనాల తయారీ సంస్థలు తయారు చేసిన వాహనాలు విడుదల చేసే ఉద్గారాలను ల్యాబ్స్‌లో పరీక్షించి.. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఆ వాహనాన్ని విక్రయించేందుకు అనుమతిస్తారు.
బీఎస్-6 రెండో దశ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు నిర్దేశిత పరిమితికి మించకూడదు. ఇప్పటివరకు ల్యాబ్స్‌లో వాహనాలు విడుదల చేసే ఉద్గారాలు పరీక్షించిన కంపెనీలు.. ఇకపై ఆర్డీఈ ప్రమాణాలు కూడా తు.చ. తప్పకుండా పాటించాలి. ఇందుకోసం కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను విక్రయించిన తర్వాత అవి విడుదల చేసే ఉద్గారాలు మరింత తగ్గించడానికి పోర్టబుల్ ఎమిషన్స్ మెజర్‌మెంట్ సిస్టమ్‌ను బిగించాలి. డీజిల్ వాహనాల్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (ఎస్సీఆర్) అనే పరికరాన్ని తప్పనిసరిగా తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. ఇది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్‌ను వినియోగించి నైట్రోజన్ ఆక్సైడ్‌లోని ఉద్గారాలను నీరుగా మారుస్తుంది.
ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు డ్రైవర్‌కు తెలిపేందుకు ఆన్‌బోర్డ్ సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్‌ను కార్ల తయారీ సంస్థలు అన్ని కార్లలో అమర్చాలి. ఈ పరికరం ఉద్గారాల విడుదల సమాచారం, కారు డ్రైవింగ్‌లో మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షిస్తూ కారు డ్రైవర్‌కు తెలుపుతుంది. ఒకవేళ ఉద్గారాలు నిర్దిష్ట పరిధి దాటితే వెంటనే సర్వీస్ చేయించాలని సూచిస్తుంది. ఆర్డీఈ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల్లో మార్పులు తయారీ సంస్థలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫలితంగా కార్ల తయారీ కంపెనీల వివిధ రకాల మోడల్ కార్ల ధరలు తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా కార్ల మోడల్స్, వాటిలో అందుబాటులో సదుపాయాలను బట్టి ఒక్కో కొనుగోలుదారుడు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సి వస్తుంది. మెర్సిడెజ్-బెంజ్, హ్యుండాయ్, టాటా మోటార్స్ వంటి సంస్థలు బీఎస్-6 రెండో దశ ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలతో కూడిన వెహికల్స్‌ను ఇప్పటికే మార్కెట్‌లోకి రిలీజ్ చేశాయి.
రెండు లీటర్లు, అంతకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ కార్లలో ఎక్కువ ధర గల ఈ పరికరాలు వాడటం ఆటోమొబైల్ సంస్థలకు గిట్టుబాటు కాదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలు కంపెనీలు రెండు లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ డీజిల్ వేరియంట్ కార్ల తయారీ నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. హోండా, హ్యుండాయ్, రెనాల్ట్, మహీంద్రా, మారుతి సుజుకి తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ పెట్రోల్ వినియోగ కార్ల ఉత్పత్తి కూడా నిలిపేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. మోటార్ బైక్‌లు, స్కూటర్ల తయారీ సంస్థలు కూడా బీఎస్-6 రెండో దశ ప్రమాణాలు పాటించడం తప్పనసరి. ప్రస్తుతం వాడుతున్న కార్బొనేటర్ల స్థానే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ (ఎఫ్‌ఐఎస్) ఉపయోగించడంతోపాటు ఓబీడీ ఏర్పాటు చేయాలి. కార్బోనేటర్లతో పోలిస్తే ఎఫ్‌ఐఎస్‌లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. వీటిని ఏర్పాటుచేస్తే బైక్‌లు, స్కూటర్ల ధరలు కనీసం 10 శాతం ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు.